జపాన్‌కు వెళ్లాలనుకునే విదేశీ ప్రయాణికులకు అదనపు భారం పడనుంది. దాదాపు 48 ఏళ్ల తర్వాత తొలిసారిగా జపాన్ ప్రభుత్వం వీసా ఫీజులను భారీగా పెంచాలని నిర్ణయించింది. కొత్త రుసుములు జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో సింగిల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీ వీసాల ఖర్చు ఐదు రెట్లు పెరగనుంది.
ప్రస్తుతం సింగిల్ ఎంట్రీ వీసాకు 3,000 యెన్‌లు వసూలు చేస్తుండగా, జూలై నుంచి అది 15,000 యెన్‌లకు పెరగనుంది. అలాగే మల్టిపుల్ ఎంట్రీ వీసా ఫీజు 6,000 యెన్‌ల నుంచి 30,000 యెన్‌లకు చేరుకోనుంది. భారత కరెన్సీలో చూస్తే సింగిల్ ఎంట్రీ వీసా ఖర్చు సుమారు రూ.1,750 నుంచి రూ.8,750 వరకు, మల్టిపుల్ ఎంట్రీ వీసా రూ.3,500 నుంచి రూ.17,500 వరకు పెరగనుంది.
జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిత్సు మొతెగి మాట్లాడుతూ, 1978లో నిర్ణయించిన వీసా ఫీజులు ఇప్పటి ద్రవ్యోల్బణం, మారకపు విలువల మార్పులను ప్రతిబింబించడం లేదని తెలిపారు. పెరుగుతున్న పరిపాలనా వ్యయాలు, బలహీనపడిన యెన్, విదేశీ సందర్శకుల సంఖ్యలో భారీ వృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే ఈ పెంపు వల్ల పర్యాటకుల రాకపై తక్షణ ప్రభావం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.
కోవిడ్ అనంతరం జపాన్‌లో పర్యాటక రంగం వేగంగా పుంజుకుంది. బలహీనమైన యెన్ కారణంగా విదేశీయులకు జపాన్ ప్రయాణం చౌకగా మారడంతో అంతర్జాతీయ సందర్శకుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో వీసా ఫీజులను ఇతర జీ-7 దేశాల స్థాయికి అనుగుణంగా పెంచాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదిలా ఉండగా, విదేశీయుల నివాస సంబంధిత దరఖాస్తులపై కూడా ప్రభుత్వం అధిక రుసుములు విధించేందుకు చట్టసవరణలు చేపట్టింది. శాశ్వత నివాస అనుమతి దరఖాస్తుల గరిష్ట రుసుము 10,000 యెన్‌ల నుంచి 300,000 యెన్‌ల వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే నివాస హోదా మార్పు, గడువు పొడిగింపు వంటి సేవలపై గరిష్ట రుసుమును 100,000 యెన్‌ల వరకు పెంచే ప్రతిపాదనలు ఆమోదం పొందాయి.
అయితే భారతీయుల విషయంలో ఈ కొత్త ఫీజులు పూర్తిగా వర్తిస్తాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం భారతదేశంలో జపాన్ వీసాల కోసం ప్రత్యేక రుసుము విధానం అమల్లో ఉండటంతో, జపాన్ రాయబార కార్యాలయం లేదా వీసా సేవా సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


