ఇల్లు అమ్మిన ఇషా అంబానీ | isha ambani sold her mansion to Hollywood stars | Sakshi
Sakshi News home page

ఇల్లు అమ్మిన ఇషా అంబానీ

Apr 5 2025 1:35 PM | Updated on Apr 5 2025 2:55 PM

isha ambani sold her mansion to Hollywood stars

భారతీయ బిలియనీర్ ముకేశ్‌-నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న తన 38,000 చదరపు అడుగుల భవనాన్ని విక్రయించారు. జెన్నిఫర్ లోపెజ్-బెన్ అఫ్లెక్‌ హాలీవుడ్ జంట దీన్ని సొంతం చేసుకుంది. బెవర్లీ హిల్స్‌లో ఉన్న ఈ విశాలమైన ప్రాపర్టీ విలువ 61 మిలియన్ డాలర్లు (సుమారు రూ.500 కోట్లకు పైగా) అని హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.

ఇషా భవనాన్ని కొనుగోలు చేయడానికి ముందు ఈ ఇద్దరు నటులు తమ ఆస్తులను కొన్నింటిని విక్రయించారు. అఫ్లెక్ తన పసిఫిక్ పాలిసేడ్స్ నివాసాన్ని 28.5 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.237 కోట్లు) విక్రయించగా, లోపెజ్ తన బెల్ ఎయిర్ భవనాన్ని 34 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.283 కోట్లు) అమ్మారు. ఇషా అంబానీ అమ్మిన ఈ భవనంలో ఇన్ఫినిటీ పూల్, 24 బాత్రూంలు, అవుట్ డోర్ కిచెన్, సెలూన్, బాక్సింగ్ రింగ్‌తో కూడిన జిమ్, 12 పడక గదులతోపాటు అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. 2022లో ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ ఈ లగ్జరీ బెవర్లీ హిల్స్ ప్రాపర్టీలో ఎక్కువ సమయమే గడిపారు.

ఇదీ చదవండి: అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?

అత్తామామలు ఇచ్చిన ఇంట్లోనే..

ప్రపంచ వ్యాపార రంగంలో ప్రముఖ వ్యక్తిగా ఉన్న ఇషా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దాతృత్వ కార్యక్రమాల్లోనూ ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. వృత్తిపరమైన విజయాలతోపాటు ఇషా తన విలాసవంతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందారు. ప్రీమియం ఆస్తులు, లగ్జరీ కార్లు, అద్భుతమైన ఆభరణాలు, డిజైనర్ దుస్తులు.. ఇలా చాలా విభాగాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. పిరమాల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పిరమాల్‌ను వివాహం చేసుకున్న ఆమె దక్షిణ ముంబైలో ఉన్న గులిటా అనే సముద్రం ఒడ్డున ఉన్న భవనంలో నివసిస్తున్నారు. ఆనంద్ తల్లిదండ్రులు అజయ్, స్వాతి పిరమల్ బహుమతిగా ఇచ్చిన ఈ భవనం విలువ సుమారు రూ.450 కోట్లుగా ఉంటుందని అంచనా.

Advertisement
 
Advertisement
Advertisement