ఇన్ఫోసిస్‌లో అసెస్‌మెంట్‌ పరీక్షలు వాయిదా! | Infosys Halts Recruitment Assessments Amid Integrity Concerns | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌లో అసెస్‌మెంట్‌ పరీక్షలు వాయిదా!

Jun 10 2026 8:27 AM | Updated on Jun 10 2026 8:53 AM

Infosys Halts Recruitment Assessments Amid Integrity Concerns

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ప్రతిష్టాత్మకమైన స్పెషలిస్ట్ ప్రోగ్రామర్, డిజిటల్ సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం జరగాల్సిన ఆన్‌లైన్ నియామక పరీక్షలు, వ్యక్తిగత అసెస్‌మెంట్లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

అక్రమాల గుర్తింపుతోనే బ్రేక్!

ఇటీవల నిర్వహించిన మూల్యాంకన ప్రక్రియలో అభ్యర్థుల ప్రవర్తనకు సంబంధించి కొన్ని అవకతవకలు, దుర్వినియోగం జరిగినట్లు కంపెనీ అంతర్గత తనిఖీల్లో వెల్లడైంది. నియామక ప్రక్రియలో వక్రీకరణలు చోటుచేసుకున్నాయన్న నివేదికల నేపథ్యంలో పరీక్షల విధానాన్ని కాపాడేందుకు ఇన్ఫోసిస్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. బాధిత అభ్యర్థులందరికీ ఇప్పటికే ఈ వాయిదా సమాచారాన్ని ఈమెయిల్స్ ద్వారా చేరవేసినట్లు స్పష్టం చేసింది. సవరించిన కొత్త అసెస్‌మెంట్‌ షెడ్యూల్స్ ఖరారు కాగానే అభ్యర్థులకు మళ్లీ సమాచారం అందిస్తామని కంపెనీ పేర్కొంది. ‘ఈ తాత్కాలిక వాయిదా వల్ల మా నియామక కట్టుబాట్లకు ఎలాంటి ఆటంకం కలగదు. అగ్రశ్రేణి ప్రతిభావంతులను గుర్తించడం, వారికి సరైన అవకాశాలు కల్పించి పెంపొందించడంపైనే మా పూర్తి దృష్టి ఉంది’ అని ఇన్ఫోసిస్ అధికారిక ప్రకటనలో తెలిపింది.

క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు యథాతథం..

కొన్ని వార్తా సంస్థల నివేదిక ప్రకారం.. ఈ పరీక్షల వాయిదా ప్రభావం కంపెనీ దూకుడుగా చేపడుతున్న క్యాంపస్ సెలక్షన్లపై పడబోదని తెలుస్తుంది. ఇన్ఫోసిస్ తన నియామక లక్ష్యాలను యథాతథంగా కొనసాగించనుంది. అయితే ఈ అంశంపై అధికారికంగా మరింత స్పష్టత రావాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ సుమారు 20,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా అదే స్థాయి లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

ఇదీ చదవండి: కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం!

Advertisement
 
Advertisement
Advertisement