ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో తన సేవలను కేవలం విమాన ప్రయాణాలకే పరిమితం చేయకుండా, ప్రయాణికుల మొత్తం ట్రావెల్ అనుభవాన్ని సులభతరం చేసే దిశగా మరో అడుగు వేసింది. ఇందులో భాగంగా 'క్యాబ్స్ విత్ ఇండిగో' (Cabs with IndiGo) అనే కొత్త ఎయిర్‌పోర్ట్ క్యాబ్ సర్వీస్‌ను ప్రారంభించింది.
ఈ సర్వీస్ ప్రధాన ఉద్దేశ్యం ప్రయాణికులకు విమానాశ్రయానికి తీసుకెళ్లడం, అక్కడి నుంచి ఇంటికి లేదా ఇతర గమ్యస్థానాలకు చేర్చడం. చాలా మంది ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యలు.. చివరి నిమిషంలో క్యాబ్ క్యాన్సిలేషన్, సర్జ్ ప్రైసింగ్, లేదా క్యాబ్ అందుబాటులో లేకపోవడం. వీటన్నింటిని తగ్గించాలనే ఉద్దేశ్యంతో సంస్థ ఈ క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేసింది.
ఈ సర్వీసును మోజోబాక్స్ అనే టెక్ భాగస్వామ్యంతో అందిస్తోంది. ఇది భారతదేశంలోని అనేక నగరాల్లో.. ఎయిర్ ట్రావెల్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది.
ఈ సర్వీస్‌లో ముఖ్యమైన ఫీచర్స్
కేవలం రూ.49 నుంచే క్యాబ్ బుకింగ్ అవకాశం
100 శాతం కన్ఫర్మేషన్‌తో గ్యారంటీడ్ పికప్
ముందుగా బుక్ చేస్తే స్పష్టమైన ధరలు
సర్జ్ ఛార్జీలు లేకపోవడం
పికప్ టైమ్ వరకు ఫ్రీ క్యాన్సిలేషన్
30 నిమిషాల ఫ్రీ వెయిటింగ్ టైమ్
ఈ సౌకర్యాల వల్ల ప్రయాణికులు ఎలాంటి ఆందోళన లేకుండా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఈ సర్వీసును ఇండిగో బ్లూచిప్ లాయల్టీ ప్రోగ్రామ్‌తో కూడా అనుసంధానం చేసింది. కాబట్టి దీని ద్వారా వినియోగదారులు ప్రతి రూ.100 ఖర్చుపై 5 బ్లూచిప్ రివార్డ్స్ సంపాదించవచ్చు. అంటే విమాన ప్రయాణాలతో పాటు క్యాబ్ బుకింగ్‌లో కూడా రివార్డ్స్ పొందే అవకాశం ఉంటుంది.
ఇటీవలి కాలంలో ఇండిగో తన సేవలను విస్తరిస్తూ.. హోటల్ బుకింగ్స్, ట్రావెల్ ఎక్స్‌పీరియెన్సెస్ వంటి అనేక సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందిస్తోంది. ఇప్పుడు క్యాబ్ సర్వీస్ కూడా చేరడంతో, ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా మారింది.


