
సోషల్ మీడియాలో నెలల తరబడి తన ఉద్యోగ అన్వేషణ గురించి.. వివరించిన భారతీయ మహిళ 'అనన్య జోషి' తగిన ఉద్యోగం పొందలేకపోయింది. దీంతో అమెరికా (America) విడిచిపెట్టాల్సి వచ్చింది. సెప్టెంబర్ 29న ఆమె అమెరికా విడిచిపెట్టే సమయంలో కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి 2024లో బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన అనన్య జోషి.. F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా బయోటెక్ స్టార్టప్‌లో ఉద్యోగంలో చేరింది. అయితే కొన్ని రోజుల తరువాత ఆమె ఉద్యోగం కోల్పోయింది. అయితే స్టూడెంట్ వీసాతో చదువు పూర్తి చేసుకున్న తరువాత.. ఎఫ్-1 వీసా(F-1 Visa)తో ఉద్యోగంలో చేరింది. ఎఫ్-1 వీసా కలిగి ఉన్న వ్యక్తులు ఉద్యోగం కోల్పోయిన నెల రోజుల సమయంలో మరో ఉద్యోగాన్ని పొందాలి. లేకుంటే దేశం వీడి బయటకు వచేయాలి.
ఇదీ చదవండి: బలవంతపు రాజీనామాలు!.. ఆందోళనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు
ఉద్యోగం కోల్పోయిన అనన్య.. నెల రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసినప్పటికీ.. చివరికి నిరాశే మిగిలింది. చేసేదేమీ లేక అమెరికా విడిచిపెట్టాల్సి వచ్చింది. అమెరికా నుంచి వచ్చే సమయంలో.. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ప్రయాణంలో నేను చాలా కష్టతరమైన అడుగు వేసాను. ఐ లవ్ యూ అమెరికా అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేసింది.