
ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్(ఐవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 1,111 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 633 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,568 కోట్ల నుంచి రూ. 8,866 కోట్లకు బలపడింది.
వడ్డీ ఆదాయం రూ. 6,535 కోట్ల నుంచి రూ. 7,386 కోట్లకు ఎగసింది. నిర్వహణ లాభం రూ. 1,676 కోట్ల నుంచి రూ. 2,358 కోట్లకు జంప్‌చేసింది. స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 2.89 శాతం నుంచి 1.97 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.51 శాతం నుంచి 0.32 శాతానికి దిగివచ్చాయి. కనీస మూలధన నిష్పత్తి 17.82 శాతం నుంచి 18.82 శాతానికి మెరుగుపడింది. ఫలితాల నేపథ్యంలో ఐవోబీ షేరు బీఎస్‌ఈలో యథాతథంగా రూ. 40 వద్ద ముగిసింది.
బంధన్ బ్యాంక్ లాభం క్షీణత
ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 65 శాతం క్షీణించి రూ. 372 కోట్లను తాకింది. మొండి రుణాలు పెరగడం, వడ్డీ ఆదాయం తగ్గడం ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,063 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 6,082 కోట్ల నుంచి రూ. 6,201 కోట్లకు బలపడింది. అయితే వడ్డీ ఆదాయం రూ. 5,536 కోట్ల నుంచి రూ. 5,476 కోట్లకు నీరసించింది.
నికర వడ్డీ ఆదాయం రూ. 2,987 కోట్ల నుంచి రూ. 2,757 కోట్లకు వెనకడుగు వేసింది. నిర్వహణ లాభం సైతం రూ. 1,941 కోట్ల నుంచి రూ. 1,668 కోట్లకు క్షీణించింది. స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 4.23 శాతం నుంచి 4.96 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.15 శాతం నుంచి 1.36 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 523 కోట్ల నుంచి రూ. 1,147 కోట్లకు భారీగా పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బంధన్ బ్యాంక్ షేరు 1.1 శాతం పుంజుకుని రూ. 187 వద్ద ముగిసింది.