
అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్
బెంగళూరు: దీర్ఘకాలికంగా తమ వ్యాపార వృద్ధికి భారత మార్కెట్ గణనీయంగా దోహదపడుతుందని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి మార్కెట్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ సమీర్ కుమార్ ఈ విషయాలు వెల్లడించారు. భారత్‌లో తమ కార్యకలాపాలకు సంబంధించి మౌలిక సదుపాయాలను పటిష్టం చేసుకునేందుకు అమెజాన్ ఈ ఏడాది రూ. 2,000 కోట్లు వెచి్చంచనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తమ కార్యకలాపాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటని కుమార్ చెప్పారు. ఇక్కడ ఆన్‌లైన్ షాపింగ్ పెరగడానికి మరింతగా అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ఇక్కడ యూజర్లు ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు కొంటున్నారు. వీడియోలను వీక్షిస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ పెరిగేందుకు ఇంకా భారీగా అవకాశాలున్నాయి. దాదాపు వంద కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి. కానీ 10 కోట్ల మంది మాత్రమే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము మరో 20 కోట్ల మందికి చేరువ కావాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని కుమార్ చెప్పారు. ఎకానమీ పెరిగే కొద్దీ వినియోగం కూడా పెరుగుతుందన్నారు.
చిన్న పట్టణాల్లో అవకాశాలు..
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారు పెరుగుతున్నారని కుమార్ చెప్పారు. ఇటీవల ముగిసిన ప్రైమ్ డే గణాంకాలు చూస్తే కొత్త, పాత ప్రైమ్ కస్టమర్లలో 70 శాతం మంది చిన్న పట్టణాల నుంచే ఉన్నారని వివరించారు. ఈ నేపథ్యంలో, ఈ ప్రాంతాల్లో ఆన్‌లైన్ షాపింగ్ పెరిగేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని కుమార్ చెప్పారు. వారు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేందుకు, మెరుగైన డీల్స్‌ను .. వేగవంతమైన డెలివరీలను పొందేందుకు అనువైన పరిస్థితులు కలి్పంచడంపై దృష్టి పెడుతున్నామని తెలిపారు.
క్విక్ కామర్స్‌కి మంచి స్పందన..
ఇటీవల బెంగళూరు, ఢిల్లీలో ప్రవేశపెట్టిన క్విక్ కామర్స్ కార్యకలాపాలకు విశేష స్పందన లభిస్తోందని కుమార్ చెప్పారు. వీటిని మరిన్ని నగరాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని వివరించారు. పోటీపై స్పందిస్తూ, మార్కెట్లో ఎన్ని సంస్థలున్నా అంతిమంగా కస్టమర్లకు ఎంత మెరుగ్గా సరీ్వసులు అందిస్తున్నామనే అంశమే కీలకంగా ఉంటుందని కుమార్ చెప్పారు.