దండుకున్న బ్యాంకులు దిగొస్తున్నాయి..! | Indian banks ending minimum balance charges | Sakshi
Sakshi News home page

దండుకున్న బ్యాంకులు దిగొస్తున్నాయి..!

Jun 1 2025 9:29 PM | Updated on Jun 1 2025 9:33 PM

Indian banks ending minimum balance charges

ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేని సామాన్యుల దగ్గర నుంచి మినిమమ్‌ బ్యాలెన్స్‌ చార్జీల కింద రూ. కోట్లు దండుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడిప్పుడే దిగొస్తున్నాయి. అకౌంట్లలో కనీస బ్యాలెన్స్‌ లేకపోతే విధించే చార్జీలను తొలగిస్తున్నాయి. ప్రధాన బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్‌ తాజాగా అన్ని రకాల సేవింగ్స్‌ అకౌంట్లకు కనీస నెలవారీ బ్యాలెన్స్‌ (ఏఎంబీ) నిబంధనను పూర్తిగా ఎత్తివేసినట్లు వెల్లడించింది. అయితే ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించలేదన్న కారణంతో బ్యాంకులు కస్టమర్ల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నాయో తెలిస్తే అవాక్కవుతారు..

మూడేళ్లలో రూ.5,614 కోట్లు లాక్కున్నాయి..
2024 ఆర్థిక సంవత్సరంలో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఖాతాదారుల నుంచి రూ. 2,331 కోట్లు వసూలు చేశాయి. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన రూ. 1,855.43 కోట్లతో పోలిస్తే 25.63 శాతం ఎక్కువ. గత మూడు సంవత్సరాలలో (2022–2024) ఈ బ్యాంకులు మొత్తం రూ.5,614 కోట్లు సామాన్య కస్టమర్ల నుంచి మినిమమ్‌ బ్యాలెన్స్‌ చార్జీల రూపంలో దోచేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐదు ప్రధాన ప్రైవేటు బ్యాంకులు (యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్) కలిపి కనీస బ్యాలెన్స్ కోసం రూ.21,000 కోట్లకు పైగా వసూలు చేశాయి.

సామాన్య ఖాతాదారుల నుంచి చార్జీలు దండుకోవడంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ముందువరసలో నిలిచింది. 2024లో ఈ బ్యాంకు రూ.633.4 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 386.51 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 369.16 కోట్లు దండుకున్నాయి. సాధారణంగా, మెట్రో ప్రాంతాల్లో సగటు నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) రూ.3,000 – రూ.10,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,000–రూ.5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.500–రూ.1,000 ఉంటుంది. దీనిని నిర్వహించకపోతే రూ.400–రూ.500 జరిమానా రూపంలో బ్యాంకులు వసూలు చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement