ఇంధన పరివర్తనంలో భారత్‌కు 71వ ర్యాంక్‌ | India slips to 71st spot on Energy Transition Index | Sakshi
Sakshi News home page

ఇంధన పరివర్తనంలో భారత్‌కు 71వ ర్యాంక్‌

Jun 20 2025 5:35 AM | Updated on Jun 20 2025 9:32 AM

India slips to 71st spot on Energy Transition Index

గతేడాదితో కంటే 8 స్థానాలు తక్కువ  

నంబర్‌ 1 స్థానంలో స్వీడన్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో భారత్‌ ర్యాంక్‌ 71వ స్థానానికి దిగజారింది. గతేడాది భారత్‌ 63వ స్థానంలో ఉండడం గమనార్హం. ఇంధన పరివర్తనంలో అంతర్జాతీయంగా 118 దేశాలతో కూడిన జాబితాలో స్వీడన్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్‌ టాప్‌–5లో ఉన్నాయి. చైనా 12వ స్థానం దక్కించుకోగా, యూఎస్‌ 17వ స్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌ 101 ర్యాంక్‌తో సరిపెట్టుకోగా, కాంగో జాబితాలో అట్టడుగు స్థానంలో ఉంది. 

ఈ వివరాలను ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసింది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనా, భారత్‌ మెరుగైన పనితీరు చూపించినట్టు డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. ముఖ్యంగా ఇంధనం లభ్యత, పరివర్తనానికి సిద్ధం కావడంలో పురోగతి సాధించినట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా ఇంధన పరివర్తనం (సుస్థిర, పర్యావరణ అనుకూల ఇంధనాలు) దశ, దిశలను అంతిమంగా టాప్‌–5 ఆర్థిక వ్యవస్థలైన చైనా, యూఎస్, ఈయూ, జపాన్, భారత్‌ నిర్ణయించనున్నట్టు తెలిపింది. 

ఇంధన లభ్యత, పునరుత్పాదక ఇంధన వనరులు, శుద్ధ ఇంధన సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు, నియంత్రణలు మెరుగుపరిచే దిశగా గడిచిన దశాబ్ద కాలంలో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించినట్టు పేర్కొంది. ఇంధన భద్రతలో యూఎస్‌ అగ్రగామిగా ఉంటే.. ఇంధన సామర్థ్యం, పెట్టుబడుల పరంగా భారత్‌ ముందడుగు వేసినట్టు తెలిపింది. 2024లో పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధన రంగంలో 2 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినప్పటికీ.. అదే ఏడాది 37.8 బిలియన్‌ టన్నులకు కర్బన ఉద్గారాలు పెరిగినట్టు పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement