
సంస్కరణలు వేగవంతం చేయాలి
16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల మోత నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడంపై భారత్ దూకుడు పెంచాలని 16 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా చెప్పారు. అదే సమయంలో అధిక వృద్ధి సాధించే దిశగా భూ, కార్మిక మార్కెట్ సంస్కరణలను వేగవంతం చేయడంతో పాటు నియంత్రణల భారాన్ని తగ్గించడంపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ‘ఒక మార్కెట్ దాదాపు మూసుకుంటున్నప్పుడు మరో మార్కెట్ వైపు మళ్లాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈయూతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా, చాలా ముఖ్యం.
అదే సమయంలో భూ, కారి్మక మార్కెట్‌కి సంబంధించి సంస్కరణలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది‘ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పనగారియా చెప్పారు. ‘మనపై టారిఫ్‌లు అమెరికా మార్కెట్లో ఎక్కువగా ఉండి యూరోపియన్ యూనియన్‌లో తక్కువగా ఉంటే.. మన ఎగుమతులను అమెరికా నుంచి ఈయూకి మళ్లించాలి. మార్కెట్లలో లాభాపేక్ష చాలా బలంగా ఉంటుంది. ఎంట్రప్రెన్యూర్లు చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తారు. చాలా వేగంగా సరఫరా వ్యవస్థల్లో మార్పులకు అనుగుణంగా సర్దుకుంటారు‘ అని చెప్పారు.
‘ప్రస్తుత పరిస్థితి ఒక రకంగా 1991 నాటి పరిస్థితులను తలపిస్తోంది. అమెరికా భారీ టారిఫ్‌ల వల్ల సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో అప్పట్లో మనం ఏం చేశామనేది ఒకసారి గుర్తు చేసుకుని, ఏం చేయగలమనేది ఆలోచించాలి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సంస్కరణల అజెండాలో చాలా చేశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి‘ అని సంపన్న దేశంగా ఎదగాలంటే భారత్ తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని, ఎగుమతుల కోసం ఆసియా మార్కెట్లపై ఫోకస్ చేయాలని, అలాగే చైనాపై మన వైఖరిని కూడా పునఃసమీక్షించుకోవాలని పనగారియా సూచించారు.
డెడ్ ఎకానమీ .. అత్యధిక వృద్ధి..
భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ (నిరీ్వర్యంగా) అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పనగారియా స్పందించారు. ’భారత ఎకానమీ నిజంగా నిరీ్వర్యమైపోతే.. 7 శాతం స్థాయిలో అత్యధిక వృద్ధి సాధించదు. డాలర్ల మారకంలో చూస్తే మన వృద్ధి బహుశా ఇంకా ఎక్కువే ఉంటుంది. డెడ్ ఎకానమీకి ఆయన నిర్వచనం ఏమిటో నాకు తెలియదు. బహుశా (ఆయన ఉద్దేశం ప్రకారం) మృత దేహాల్లోనూ కదలిక ఉంటుందేమో’ అని వ్యాఖ్యానించారు.