
భారతదేశ సెమీకండక్టర్ మిషన్‌కు గణనీయమైన ప్రోత్సాహంగా ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో రూ.3,076 కోట్ల సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రూ.76,000 కోట్ల ఇండియా సెమీకండక్టర్ మిషన్లో భాగంగా ఉంది.
సెమీకండక్టర్లు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలకు కీలకంగా మారాయి. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్, పారిశ్రామిక పరికరాలు.. వంటి ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్‌లో వీటి వాడకం అనివార్యం అయింది. తాజాగా ఆమోదం పొందిన ప్రాజెక్ట్ సెమీకండక్టర్ డిస్‌ప్లే డ్రైవర్ చిప్ తయారీపై దృష్టి పెడుతుంది. ఈ డిస్‌ప్లే డ్రైవర్ చిప్ అనేది స్క్రీన్లపై చిత్రాలు ఎలా కనిపిస్తాయో నియంత్రించే కీలకమైన భాగం.
దేశీయ అవసరాలు తీర్చేలా..
నెలకు 20,000 వేఫర్ల ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ నెలకు 36 మిలియన్ చిప్స్ ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. డిస్‌ప్లే డ్రైవర్ చిప్‌లకు సంబంధించి 40% దేశీయ డిమాండ్‌ను తీర్చగలదని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: మర మనిషా..? మైఖేల్ జాక్సనా..?
డిజిటల్ భవిష్యత్తు
5జీ, ఏఐ, ఐఓటీ, స్మార్ట్ మొబిలిటీ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు సెమీకండక్టర్ పరిశ్రమ కీలకం. భారతదేశం గ్లోబల్ సెమీకండక్టర్ పవర్‌హౌజ్‌గా మారేందుకు అడుగులు వేస్తున్న తరుణంగా జెవార్ ప్రాజెక్ట్ వంటి కార్యక్రమాలు సాంకేతికత వృద్ధితోపాటు దేశానికి ఆర్థిక వృద్ధికి తోడ్పడుతాయని నిపుణులు అంటున్నారు.