విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) 1980 పాస్‌పోర్ట్ నిబంధనల ప్రకారం ఫీజులను సవరించారు. 2026 జులై 1 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. అంటే కొత్తగా పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసేవారు ఎక్కువ ఫీజును చెల్లించాల్సి ఉంటుందన్న మాట.
36 పేజీల పాస్‌పోర్ట్ కోసం ఇప్పుడు రూ.2,500, తత్కాల్ కేటగిరీ కింద రూ.5000
60 పేజీల పాస్‌పోర్ట్ కోసం రూ.3,500, తత్కాల్ ప్రాసెసింగ్ కింద రూ. 6,000
పాస్‌పోర్ట్ పోయినప్పుడు లేదా డ్యామేజ్ అయినప్పుడు రీప్లేస్‌మెంట్ ఖర్చులు కూడా పెరిగాయి. 36 పేజీల పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్‌కు సాధారణంగా రూ.5,000, తత్కాల్‌లో రూ.7,500 చెల్లించాలి. 60 పేజీల రీప్లేస్‌మెంట్ కోసం రూ.6,000 నుంచి రూ.8,500 వరకు ఫీజు నిర్ణయించారు.
ఇతర పాస్‌పోర్ట్ సంబంధిత సేవలకూ కొత్త ఛార్జీలు నిర్ణయించారు. ఉదాహరణకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, సరెండర్ సర్టిఫికేట్లు, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ వెరిఫికేషన్, ఇతర సర్టిఫికేట్లతో సహా, పాస్‌పోర్ట్‌కు సంబంధించిన వివిధ సేవల కోసం భారతదేశంలో రూ.750 ఫీజు ఉండగా, ఐడెంటిటీ సర్టిఫికెట్‌కు రూ.1,000 చెల్లించాలి. విదేశాల్లో అవసరమయ్యే ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం 15 డాలర్లు, ఐడెంటిటీ సర్టిఫికెట్ కోసం 50 డాలర్ల ఫీజు నిర్ణయించారు. అయితే ఈ సేవలకు తత్కాల్ సౌకర్యం ఉండదు.
కొత్త నిబంధనల ప్రకారం పెద్దల పాస్‌పోర్ట్ 10 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. మైనర్ల పాస్‌పోర్ట్ అయితే 5 సంవత్సరాలు లేదా పాస్‌పోర్ట్ హోల్డర్‌కు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు, ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అంతవరకు చెల్లుబాటులో ఉంటాయి.
ఇదీ చదవండి: EPFO సేవలకు బ్రేక్.. చందాదారులకు అలర్ట్!


