ప్రపంచంలో మన పాస్‌పోర్ట్ ఎంత పవర్‌ఫుల్‌ అంటే.. | Global Passport Index 2026, India Ranks World Most Powerful Passports, India Placed 125th And Europe Dominates Top 10 | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో మన పాస్‌పోర్ట్ ఎంత పవర్‌ఫుల్‌ అంటే..

Jul 5 2026 7:54 AM | Updated on Jul 5 2026 11:23 AM

Global Passport Index 2026: India Ranks World Most Powerful Passports

ప్రపంచ పాస్‌పోర్ట్‌ల బలాన్ని కేవలం వీసా-రహిత ప్రయాణంతోనే కాకుండా, విదేశాల్లో నివసించే అవకాశాలు, పెట్టుబడులు, జీవన నాణ్యత వంటి అంశాల ఆధారంగా అంచనా వేసే ‘గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (Global Passport Index–GPI) 2026’ నివేదిక విడుదలైంది. ఈ ఏడాది కూడా యూరప్ దేశాలే ఆధిపత్యం చాటగా, టాప్-10లో తొమ్మిది స్థానాలను యూరోపియన్ దేశాలు కైవసం చేసుకున్నాయి. ఆసియా నుంచి సింగపూర్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.

ఏమిటీ గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్?

గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ రూపొందించే ఈ సూచీ, సాధారణ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లకు భిన్నంగా ఉంటుంది. ఎక్కువ దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశాన్ని మాత్రమే కాకుండా, పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తికి ప్రపంచవ్యాప్తంగా లభించే మొత్తం ప్రయోజనాలను అంచనా వేస్తుంది. ఇందులో మొబిలిటీ (50 శాతం), పెట్టుబడి అవకాశాలు (25 శాతం), జీవన నాణ్యత (25 శాతం) అనే మూడు ప్రధాన విభాగాల్లో మొత్తం 14 సూచికలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ వంటి అంతర్జాతీయ సంస్థల గణాంకాలను ఉపయోగిస్తారు.

టాప్-10 శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు

1. స్వీడన్
2. స్విట్జర్లాండ్
3. ఫిన్లాండ్
4. జర్మనీ
5. నెదర్లాండ్స్, 
6. డెన్మార్
7. ఐర్లాండ్
8. యునైటెడ్ కింగ్‌డమ్
9. నార్వే
10. సింగపూర్

భారత్ పరిస్థితి ఎలా ఉందంటే..?

గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో 200 దేశాల్లో భారత్ 125వ స్థానంలో నిలిచింది. మొబిలిటీ విభాగంలో 135వ స్థానం, జీవన నాణ్యతలో 118వ స్థానం నమోదు చేసింది. గత కొన్నేళ్లలో అనేక దేశాలు తమ పౌరులకు అంతర్జాతీయ ప్రయాణ సౌలభ్యాన్ని మరింత విస్తరించగా, ఆ వేగంతో భారత్ పురోగతి సాధించలేదని ఈ నివేదిక సూచిస్తోంది.

అయితే, కేవలం వీసా-రహిత ప్రయాణ అవకాశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌‌లో భారత్ ప్రస్తుతం 80వ స్థానంలో ఉంది. తాజా జూలై 2026 అప్‌డేట్ ప్రకారం భారత పాస్‌పోర్ట్ కలిగిన వారు 56 దేశాలకు వీసా-ఫ్రీ లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యంతో ప్రయాణించగలరు. ఈ దేశాల్లో ఎక్కువ భాగం ఆఫ్రికా, ఆసియా, కరేబియన్, పసిఫిక్ ప్రాంతాలకు చెందినవే. అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, చాలా యూరోపియన్ దేశాలకు మాత్రం భారతీయులు ఇప్పటికీ ముందస్తు వీసా పొందాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement