‘జెన్‌’ ఇన్‌ బ్లాక్‌ | India car colour preference: Black dominates | Sakshi
Sakshi News home page

‘జెన్‌’ ఇన్‌ బ్లాక్‌

Jan 14 2026 12:15 AM | Updated on Jan 14 2026 12:15 AM

India car colour preference: Black dominates

యూత్ ఫస్ట్ ఛాయిస్.. బ్లాక్ బ్యూటీస్

వైట్‌ ట్రెండ్‌కు బ్రేక్‌ 

ఐదేళ్లుగా నల్ల కార్ల హవా

ప్రీమియం ఎడిషన్స్‌పై జెన్‌ జెడ్, యువత మక్కువ

ఎన్ని రంగులు ఉన్నా తెల్ల రంగు కారు అందమే వేరు. ఆకర్షణీయమైన, ప్రశాంతమైన లుక్, అధిక రీసేల్‌ వేల్యూలాంటి అంశాల కారణంగా దశాబ్దాలుగా తెల్ల కార్లకు డిమాండ్‌ కొనసాగుతోంది. కానీ ఇప్పుడు దాని స్థానాన్ని క్రమంగా నల్ల రంగు కార్లు ఆక్రమిస్తున్నాయి. జేటో డైనమిక్స్‌ డేటా ప్రకారం గత అయిదేళ్లుగా వార్షికంగా తెల్ల కార్ల ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు తగ్గాయి. 2021లో అమ్ముడైన మొత్తం కార్లలో వీటి వాటా 43.9 శాతంగా ఉండగా, 2025లో 40.7 శాతానికి పడిపోయింది. అదే సమయంలో నల్ల రంగు కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

2021లో 14.8 శాతంగా ఉన్న వీటివాటా 2025లో దాదాపు 20.76 శాతానికి ఎగిసింది. పరిశ్రమ సగటుతో పోలిస్తే నల్ల రంగు కార్ల అమ్మకాలు గత అయిదేళ్లుగా భారీగా వృద్ధి చెందాయని మారుతీ సుజుకీ వర్గాలు తెలిపాయి.  జెనరేషన్‌ జెడ్, యువ కొనుగోలుదార్లలో ప్రీమియం ఎడిషన్లు, బ్లాక్‌ కలర్‌ కార్లపై ఆసక్తి పెరిగిందని పేర్కొన్నాయి. హ్యుందాయ్‌ మోటర్స్‌ 2021లో దేశీయంగా నమోదు చేసిన అమ్మకాల్లో నల్ల కార్ల వాటా 9 శాతంగా ఉండగా 2024 నాటికి (జనవరి–నవంబర్‌) ఇది 19 శాతానికి పెరిగింది.  వ్యక్తిత్వాన్ని వ్యక్తపర్చేందుకు ఉపయోగపడే సాధనంగా కారు మారిందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. దీనితో ఆత్మవిశ్వాసం, ప్రీమియం లుక్‌ ఉట్టిపడే రంగుల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నాయి.  

మారుతున్న అభిరుచులు, మార్కెటింగ్‌ వ్యూహాలు.. 
కొనుగోలుదారుల మారుతున్న అభిరుచులు, కార్ల కంపెనీలు అనుసరించే వ్యూహాలతో కూడా నలుపు రంగుకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. ప్రీమియం, లైఫ్‌స్టయిల్‌ ఆధారిత సెగ్మెంట్లలో ముదురు వర్ణాలను ఇండివిడ్యువాలిటీ, హోదా, ఆధునికతకు ముడిపెట్టి ఆటోమొబైల్‌ కంపెనీలు వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. హై ఫ్యాషన్, లగ్జరీ ఉత్పత్తులుగా వాటిని మార్కెటింగ్‌ చేస్తున్నాయి. తయారీపరంగా కూడా మిగతా తేలికపాటి రంగులతో పోలిస్తే నలుపు రంగుతో పెయింటింగ్‌ ప్రక్రియ సరళంగా పూర్తవుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

నలుపు రంగు అనేది దుమ్మును, చిన్న చిన్న గీతలను అంతగా కనిపించకుండా చేయగలదని వివరించాయి. 2025లో దేశీయంగా అమ్ముడైన మొత్తం స్పోర్ట్‌ యుటిలిటీ వాహనాల్లో (ఎస్‌యూవీ) దాదాపు 30 శాతం వాటా వాహనాలు నలుపు రంగు వాటిది కాగా, హ్యాచ్‌బ్యాక్‌లలో ఇది 6.77 శాతంగా ఉంది.  అంతర్జాతీయంగా చూస్తే యువతరం బోల్డ్‌ స్టయిల్‌ స్టేట్‌మెంట్‌గా నలుపు రంగును ఎంచుకుంటుండగా, పెద్దవారు కాస్త తేలికపాటి రంగులను ఎంచుకుంటున్నారు. వేడిమిని ఎక్కువగా గ్రహించే స్వభావం, భారత్‌లో వేడి వాతావరణంలో మెయింటెనెన్స్‌పరమైన సవాళ్లు ఉన్నప్పటికీ మాస్‌ మార్కెట్‌ కొనుగోలుదారులు నలుపు ఎస్‌యూవీలను దూకుడుగా కనిపించే స్టయిల్‌ కోసం ఎంపిక చేసుకుంటుండగా, లగ్జరీ కొనుగోలుదార్లు హోదాకు చిహ్నంగా ఎంచుకుంటున్నారు.      – సాక్షి, బిజినెస్‌డెస్క్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement