5జీ యూజర్లు @ 110 కోట్లు! | India 5G subscriber base will cross 1. 1 billion by 2031 | Sakshi
Sakshi News home page

5జీ యూజర్లు @ 110 కోట్లు!

Jun 17 2026 1:46 AM | Updated on Jun 17 2026 1:46 AM

India 5G subscriber base will cross 1. 1 billion by 2031

2031 నాటికి మొత్తం కనెక్షన్లలో 81 శాతానికి వాటా 

70 జీబీకి నెలవారీ డేటా వాడకం 

భారత్‌ టెలికం మార్కెట్‌పై ఎరిక్సన్‌ నివేదిక  

న్యూఢిల్లీ: వచ్చే ఆరేళ్లలో 2031 నాటికి భారత్‌లో 5జీ యూజర్ల సంఖ్య 110 కోట్లకు చేరనుంది. మొత్తం కనెక్షన్లలో 5జీ వాటా 81 శాతానికి చేరనుంది. స్వీడన్‌కి చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2025 ఆఖరు నాటికి దేశీయంగా 5జీ యూజర్ల సంఖ్య 43 కోట్లకు, మొత్తం మొబైల్‌ సబ్ స్క్రిప్షన్లలో వాటా 35 శాతానికి చేరిందని రిపోర్టు పేర్కొంది. మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ మెరుగుపడటంతో 5జీ వినియోగం గణనీయంగా పెరుగుతోందని ఎరిక్సన్‌ ఇండియా ఎండీ నితిన్‌ బన్సల్‌ తెలిపారు. 

భారీ స్థాయిలో సమ్మిళితత్వం, గవర్నెన్స్, ఆవిష్కరణలకు పటిష్టమైన, సురక్షితమైన 5జీ మౌలిక సదుపాయాలు తోడ్పడుతున్నాయని, డిజిటల్‌ ఇండియాకి శక్తివంతమైన పునాది వేస్తున్నాయని వివరించారు. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు వైవిధ్యమైన సర్వీసులను కూడా ప్రవేశపెడుతున్నాయని నివేదిక పేర్కొంది. నేరుగా ఎయిర్‌టెల్‌ని ప్రస్తావించకుండా, పోస్ట్‌పెయిడ్‌ 5జీ కస్టమర్లకు ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న సందర్భాల్లోనూ మెరుగైన సేవలు అందేలా ఓ టెలికం కంపెనీ .. నెట్‌వర్క్‌ స్లైసింగ్‌ ఇటీవలే వైవిధ్యమైన కనెక్టివిటీ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది.  

నివేదికలోని మరిన్ని విశేషాలు.. 
→ డివైజ్‌లు చౌకగా లభిస్తుండటం, నెట్‌వర్క్‌ కవరేజీ 
విస్తృతంగా ఉండటం, ఫిక్సిడ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ (ఎఫ్‌డబ్ల్యూఏ) సేవలు అందుబాటులోకి వస్తుండటంతో 5జీ వినియోగం భారీగా పెరుగుతోంది. చాలా మటుకు సర్వీస్‌ ప్రొవైడర్లకు సంబంధించి డౌన్‌లింక్‌ కన్నా అప్‌లింక్‌ ట్రాఫిక్‌ వేగంగా పెరుగుతోంది.  

→ ప్రతి స్మార్ట్‌ఫోన్‌పై మొబైల్‌ డేటా వినియోగం విషయంలో గ్లోబల్‌గా భారత్‌ అగ్రస్థానంలో ఉంటోంది. నెలవారీ యూసేజీ సగటున 37 జీబీగా ఉండగా, 2031 నాటికి 
70 జీబీకి చేరనుంది.  
 

→ 46 శాతం వాటాతో 4జీ ఇప్పటికీ ప్రధాన టెక్నాలజీగానే కొనసాగుతున్నప్పటికీ దాని వినియోగం క్రమంగా తగ్గుతోంది. 2025లో 57 కోట్లుగా ఉన్న యూజర్ల సంఖ్య 2031 నాటికి 16 కోట్లకు పడిపోనుంది.  

→ అంతర్జాతీయంగా 5జీ మొబైల్‌ సబ్ స్క్రిప్షన్ల సంఖ్య 2026 తొలి త్రైమాసికంలో తొలిసారిగా మూడు వందల కోట్ల మార్కును దాటింది. ఈ ఏడాది మొదటి క్వార్టర్‌లో గ్లోబల్‌గా 16.2 కోట్ల కొత్త 5జీ కనెక్షన్లు జత కావడంతో మొత్తం సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య 310 కోట్లకు చేరింది. ఇది 2031 నాటికి రెట్టింపు కన్నా అధిక స్థాయికి (640 కోట్లు) చేరనుంది. 

→ ఇప్పటివరకు 390 సర్వీస్‌ ప్రొవైడర్లు కమర్షియల్‌ 5జీ సర్వీసులు ప్రారంభించాయి. 90కి పైగా సంస్థలు 5జీ సేవలను స్టాండెలోన్‌ ప్రాతిపదికన ప్రవేశపెట్టాయి. 

→ 2025 ఆఖరు నాటికి మొత్తం మొబైల్‌ డేటా ట్రాఫిక్‌లో 48 శాతం వాటా 5జీ నెట్‌వర్క్‌లదే ఉంది. 2031 ఆఖరు నాటికి ఇది 85 శాతానికి చేరొచ్చని అంచనా. 

→ పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా, ఈశాన్య ఆసియా, గల్ఫ్‌ దేశాల్లో 5జీ సేవల వినియోగం 2031 నాటికి 90 శాతానికి చేరవచ్చు.  

→ ఫిక్సిడ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ (ఎఫ్‌డబ్ల్యూఏ)కి సంబంధించి వేగం ఆధారిత టారిఫ్‌ ప్లాన్ల ద్వారా వివిధ మార్కెట్‌ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలను టెల్కోలు కొనసాగిస్తాయి.  

→ మొత్తం ఎఫ్‌డబ్ల్యూఏ సర్వీస్‌ ప్రొవైడర్లలో 5జీ ద్వారా సేవలందించే సంస్థల వాటా 71 శాతానికి చేరింది. 2025 జూన్‌లో ఇది 57 శాతంగా ఉంది. స్పీడ్‌ ఆధారిత టారిఫ్‌ ప్లాన్లను అందించే ఎఫ్‌డబ్ల్యూఏ సర్వీస్‌ ప్రొవైడర్ల సంఖ్య గతేడాది 51 శాతంగా ఉండగా ప్రస్తుతం 57 శాతానికి చేరింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement