2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31. అంటే.. వచ్చే నెలాఖరులోపలే. ఈ రోజు నాటికి ఫారం 1,2 అలాగే ఫారం 4 దాఖలు చేయడానికి అన్ని యుటిలిటీలు రెడీగా ఉన్నాయి. రిటర్నులు దాఖలు అవుతున్నాయి. అయితే, 1 గానీ 2 గానీ 4 గానీ ముందుగా మీరు ‘ఇన్‌కం స్టేట్‌మెంట్’ చేసుకోవాలి. ఈ స్టేట్‌మెంట్ తయారు చేసుకోవడం చాలా సులువైన పని.
ఇంకేం.. రంగంలోకి దూకండి.
ఆదాయంపరంగా ఆలోచిస్తే, మీరు మీ ఆదాయం ఏయే ‘సోర్స్’ ద్వారా వస్తుందో ఒక పట్టిక/జాబితా చేయండి. ఉదాహరణకి
🔸 జీతం/వేతనం
🔸 పెన్షన్
🔸 కొన్ని నెలలు జీతం, మిగతా నెలలు పెన్షన్
🔸 యాన్యుటీలు
🔸 ప్రతి నెలా వచ్చే ఇంటద్దెలు. మీ సౌలభ్యం కోసం మీరు మీరు అద్దెకిచ్చిన ప్రాపర్టీల జాబితా తయారు చేసుకోండి.
క్రమసంఖ్య, ఇంటి నంబరు, ప్లాట్ నంబరు, లొకేషన్, ఊరి పేరు, పట్నం పేరు మొదలైన వివరాలు ఉండాలి. ఈ ప్రాపర్టీలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించి చూడండి. ఓనర్‌షిప్.. సింగిలా/జాయింటా? వాడుకలో మాది మాది అని అంటాం, ఎప్పుడు కొన్న ప్రాపర్టీ అనేది వివరాలు గుర్తుండవు. అప్పట్లో బ్యాంకర్లు (ఇప్పుడూ అనుకోండి) అప్పు ఎక్కువ రావడానికి మీ జీవిత భాగస్వామిని/కుటుంబ సభ్యులను కో–అప్లికెంటుగా ఇరికిస్తారు లేక మీరే ట్యాక్స్ ప్లానింగ్‌కని ఇద్దరూ కలిసి జాయింటుగా రాస్తారు. ఇవన్నీ ఓనర్‌షిప్‌కి పనికి వస్తాయి. తర్వాత చెల్లించిన మున్సిపల్ ట్యాక్స్ చెల్లింపులు, బ్యాంకులు, జమలు, నగదు వసూళ్లు, అద్దెలోకి వస్తాయి.
🔸ప్రతినెల మీ బ్యాంకు ఖాతాలో జమయ్యే వడ్డీలు.
🔸 మీ చేతికి నెల నెలా రాకపోయినా మీ ఎఫ్‌డీఆర్‌కి క్రెడిట్ అయ్యేవి, మెచ్యూరిటీ రోజు నాటికి మొత్తం అసలు, వడ్డీ జమ అవుతాయి. కానీ మీరు సంవత్సరానికి వచ్చిన వడ్డీనే తీసుకోవచ్చు.
🔸 జమ అయ్యే వడ్డీలు, అలాగే జమ కానివి, నగదు రూపేణా వచ్చేవి.
🔸 డివిడెండ్లు, బ్యాంకులో జమ అవుతాయి.
🔸 ఇతర ఆదాయాలు
🔸 వ్యవసాయ ఆదాయాలు. బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంటు/పాస్‌బుక్‌లో ప్రతి జమ, ఎందుకొచి్చందో విశ్లేషించండి. వివరించండి.
🔸 ముందుగా విత్‌డ్రా చేసి, ఖర్చులు పోను, మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశారనుకోండి.. అది మీ ఆదాయం కాదు.
🔸 మీకు ఎవరైనా అప్పు తీర్చి ఉంటే, ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తే, అది ‘ఆదాయం’ కాదు. కానీ ఇలాంటి వ్యవహారాలు ‘శల్యపరీక్ష’కు గురవుతాయి.
🔸 ఆస్తులు, షేర్లు, సెక్యూరిటీలు, బంగారం, ఆభరణాల్లాంటి విలువైన వస్తువులను అమ్మగా వచి్చన డిపాజిట్లు. వీటి మీద క్యాపిటల్ గెయిన్స్ పడే అవకాశం ఉంది. విశ్లేషణ, వివరణ చేసుకోండి.
🔸 పీఎఫ్ విత్‌డ్రాయల్స్, ఎల్‌ఐసీ పాలసీ మెచ్యూరిటీ మొత్తం, ఎన్‌ఎస్‌సీల మెచ్యూరిటీ, చిట్‌ఫండ్‌లో చేరి పాట పాడగా వచ్చిన మొత్తం, పూర్తి విశ్లేషణ, సమగ్రంగా వివరణ అవసరం
🔸 మీరు వ్యాపారస్తులైతే ప్రత్యేకంగా అకౌంట్స్ నిర్వహించండి. వ్యాపారపు కరెంటు ఖాతా నుంచి మీ ఎస్‌బీ అకౌంటుకు చేసిన జమలు.. అవి సొంత వాడకాలా... జీతమా లేక అప్పు తీర్చడమా.. విశ్లేషించుకోండి.
🔸 వీలున్నంత వరకు కరెంటు ఖాతా, మరియు ఎస్‌బీ అకౌంటును విడివిడిగా నిర్వహిస్తూ, రెండింటి మధ్య వ్యవహారాలు, తక్కువగా ఉండేలా చూసుకోండి. అనివార్యమైతే, సరిగ్గా విశ్లేషణ, వివరణ రెడీగా పెట్టుకోండి.
🔸 ఏ జమ పడినా వివరణ ఉంచుకోండి.
చివరిగా, మీ అన్ని బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి. వివరాలు పొందుపర్చండి. జీతం నిమిత్తం 12 జమలు ఉండాలి. తక్కువ, ఎక్కువ అయితే, ఆరా తీయండి. అద్దె జమలు 12 రసీదులకు తగ్గినా, ఎక్కువయినా ఆరా తీయండి. అద్దె విషయంలో అడ్వాన్స్‌లను జాగ్రత్తగా సర్దుబాటు చేయండి. 2026 మార్చి 31 తర్వాత కూడా 2025–26కి సంబంధించిన వ్యవహారాలు జమ కావొచ్చు. అలాగే, ఏప్రిల్ 2025లో 2024–25కి సంబంధించినవి జమ కావొ చ్చు. ఇప్పుడు మీ చేతిలో ‘జమలు’ ఉన్నాయి. వాటి సాయంతో ‘స్టేట్‌మెంట్’ చేయడానికి ఉపక్రమించండి.


