
హైదరాబాద్‌లో ‘రియల్’ దూకుడు పెరిగింది. నగరానికి నాలుగు వైపులా భారీ లేఅవుట్లు, కొత్త వెంచర్లు విస్తరిస్తున్నాయి. మరోవైపు విల్లాలు, బహుళ అంతస్తుల భవనాల విక్రయాల్లో సైతం జోరు పెరిగింది. దాదాపు ఏడాది కాలంగా నెలకొన్న ‘రియల్’ స్తబ్దత క్రమంగా పటాపంచలవుతోంది.
– సాక్షి, సిటీబ్యూరో
మహా నగర పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడంతో పాటు ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు, మెట్రో రెండో దశ ప్రతిపాదనలు, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. మరోవైపు ఇటీవల హౌసింగ్ బోర్డు నిర్వహించిన బిడ్డింగ్‌కు సైతం అనూహ్య స్పందన లభించింది. ఫ్యూచర్ సిటీ నుంచి షాద్‌నగర్ వరకు కొత్త వెంచర్లకు డిమాండ్ కనిపిస్తోంది. కొత్తగా విలీనమైన గ్రామాల్లో ఇప్పుడు భారీ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి.
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని ఘట్‌కేసర్, శంషాబాద్, శంకర్‌పల్లి, మేడ్చల్ తదితర అన్ని జోన్లలో లే అవుట్లు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతుల్లో జాప్యాన్ని నివారించేందుకు హెచ్‌ఎండీఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో కొంతకాలంగా అనుమతుల ప్రక్రియలో వేగం పెరిగింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 922 అనుమతులను ఇచ్చారు. మరో ఆరు నెలల్లో అనుమతులు రెట్టింపయ్యే అవకాశం ఉంది.
గత మూడేళ్లలో హెచ్‌ఎండీఏ ఇచ్చిన అనుమతులు

గతేడాది కంటే ఎక్కువే..
గత సంవత్సరం 2024లో మొత్తం 878 అనుమతులు మాత్రమే ఇచ్చారు. కానీ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 922 అనుమతులు ఇవ్వడం విశేషం. గత సంవత్సరం అన్ని అనుమతులపై హెచ్‌ఎండీఏకు రూ.395.13 కోట్ల ఆదాయం లభించగా ఈ సంవత్సరం జూన్ వరకు రూ.519 కోట్లకు పైగా ఆదాయం లభించింది. మరోవైపు 2023 సంవత్సరంలో 1,361 అనుమతులు ఇచ్చారు. రూ.563.32 కోట్ల ఆదాయం లభించింది.

నిర్మాణ రంగంలో కొంతకాలం స్తబ్దత నెలకొన్నప్పటికీ క్రమంగా పుంజుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. టీజీబీపాస్ స్థానంలో కొత్తగా బిల్డ్‌నౌను ప్రవేశపెట్టిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ కూడా సులభతరమైంది. క్షణాల్లోనే డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసే సదుపాయం లభించింది. మరోవైపు దరఖాస్తుదారులకు కూడా ఎలాంటి జాప్యం లేకుండా ‘కీ’లు లభిస్తున్నాయి. కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దరఖాస్తు ప్రక్రియ మాత్రం వేగవంతం అయినట్లు అధికారులు తెలిపారు.
వేలానికి సిద్ధంగా హెచ్‌ఎండీఏ స్థలాలు
మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూలమైన మార్పు రావడంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థలాలు, భూములను ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ సన్నద్ధమవుతోంది. గతంలో భూముల అమ్మకాలకు అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. కోకాపేట్, బుద్వేల్, మోకిల తదితర ప్రాంతాల్లో భారీ స్పందన లభించింది.
అలాగే తుర్కయంజాల్, తొర్రూరు, బాచుపల్లి, మేడిపల్లి తదితర ప్రాంతాల్లోనూ హెచ్‌ఎండీఏ ప్లాట్లు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలిన స్థలాలతో పాటు కొత్త వెంచర్లలోనూ విక్రయాలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బహదూర్‌పల్లి, లేమూరు, ఇన్ముల్ నెర్వా తదితర ప్రాంతాల్లో త్వరలో వేలం నిర్వహించే అవకాశం ఉంది.
వివిధ ప్రాంతాల్లో ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు సిద్ధంగా ఉన్న హెచ్‌ఎండీఏ లే అవుట్‌లు
