హైదరాబాద్‌లో పెరిగిన ఆఫీస్‌ అద్దెలు.. అయినా తక్కువే.. | Hyderabad Office Rents Surge 24pc | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పెరిగిన ఆఫీస్‌ అద్దెలు.. అయినా తక్కువే..

Jun 7 2025 8:34 PM | Updated on Jun 7 2025 8:55 PM

Hyderabad Office Rents Surge 24pc

దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో ఆఫీసు స్పేస్‌ అద్దెలు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా తర్వాత ఆఫీసు స్పేస్‌ విభాగం శరవేగంగా కోలుకుంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, హైదరాబాద్‌ నగరాలలో కార్యాలయ స్థలాలు హాట్‌స్పాట్‌గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు, అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ గణనీయమైన పెరుగుదల నమోదు చేస్తోందని అనరాక్‌ సంస్థ రిపోర్ట్‌లో వెల్లడించింది.     – సాక్షి, సిటీబ్యూరో

దాదాపు అన్ని బహుళ జాతి, దేశీయ సంస్థలు వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానానికి స్వస్తి చెప్పాయి. పూర్తి స్థాయిలో కార్యాలయాలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో ఆఫీసు స్పేస్‌కు క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో కార్యాలయాల అద్దె విలువలు వృద్ధి చెందుతున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో అలవాటైన వర్క్‌ ఫ్రం హోమ్, హైబ్రిడ్‌ మోడల్‌ పని విధానాలు మరింత సంప్రదాయక, నిర్మాణాత్మక కార్యాలయ కార్యకలాపాలకు దారి తీసింది. కంపెనీలు ప్రధాన నగరాలలో తమ ఉనికిని రెట్టింపు చేశాయి. గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), టెక్‌ దిగ్గజాలు, బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు గ్రేడ్‌–ఏ కార్యాలయ స్థలాల లీజులు, కొనుగోళ్లకు మొగ్గు చూపించాయి. మన దేశంలో ఆఫీసు స్పేస్‌ విభాగంలో జీసీసీలు చోదకశక్తిగా మారాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే జీసీసీలు ఏకంగా 83.5 లక్షల చ.అ. స్థలాన్ని లీజుకు తీసుకున్నాయంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు.

అమెరికాలో అనిశ్చితితో.. 
యూఎస్‌ కంపెనీలు మన దేశంలోని గ్రేడ్‌–ఏ ఆఫీసు స్పేస్‌ లీజులపై ఆసక్తి చూపిస్తుంటాయి. ప్రస్తుతం దేశీయ ఆఫీసు స్పేస్‌ విభాగంలో అమెరికాకు చెందిన సంస్థల వాటా 45 శాతం ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో వ్యాపార విధానంలో అనిశ్చితి ఏర్పడటంతో ఇండియా లోని ఆఫీసు స్పేస్‌కు మరింత డిమాండ్‌ ఏర్పడింది. ముంబైలోని ఆఫీసు స్పేస్‌ లీజులలో అమెరికాకు చెందిన బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల వాటా ఏకంగా 48 శాతంగా ఉంటుంది.

అత్యధికంగా ముంబైలో.. 
నాలుగేళ్లలో అత్యధికంగా ముంబైలో అద్దెలు 28 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లో 24.1 శాతం వృద్ధి చెందాయి. ఇక ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 20 శాతం, బెంగళూరులో 15.8 శాతం, పుణెలో 11.1 శాతం, చెన్నైలో 9.1 శాతం మేర పెరిగాయి. 2022లో ముంబైలో చ.అ. అద్దె నెలకు రూ.131గా ఉండగా.. 2025 నాటికి రూ.168కి చేరింది. హైదరాబాద్‌లో నాలుగేళ్ల క్రితం రూ.58గా ఉండగా.. ఇప్పుడది రూ.72కు చేరింది.

మన దగ్గరే తక్కువ.. 
హైదరాబాద్‌లో ఆఫీసు స్పేస్‌ అద్దెలు గణనీయంగా పెరిగాయి. నాలుగేళ్లలో 24.1 శాతం మేర వృద్ధి చెందాయి. నాలుగేళ్లలో ప్రధాన నగరాలలో ఆఫీసు స్పేస్‌ అద్దెల వృద్ధిలో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. అయినా కూడా ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇప్పటికీ మన దగ్గరే అద్దెలు తక్కువగా ఉన్నాయి. కాస్మోపాలిటన్‌ కల్చర్, తక్కువ జీవన వ్యయం, అందుబాటు ధరలు, చురుకైన ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్‌ వంటివి నగరంలో ఆఫీసు స్పేస్‌ అద్దెల వృద్ధికి ప్రధాన కారణాలు.

Advertisement
 
Advertisement
Advertisement