
చైనా టెక్ దిగ్గజం హువావే ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) బ్యాటరీ టెక్నాలజీలో సంచలనం సృష్టించబోతోంది. తక్కువ సమయంలో ఛార్జ్ అయ్యే, ఎక్కువ రేంజ్ ఇచ్చే బ్యాటరీని రూపొందిస్తున్న ఈ కంపెనీ అందులో పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. బీజీఆర్ రిపోర్ట్ ప్రకారం.. ఈ కొత్త సాలిడ్-స్టేట్ బ్యాటరీ 1,800 మైళ్ళు (సుమారు 3,000 కిలోమీటర్లు) డ్రైవింగ్ పరిధిని అందించగలదు. ఐదు నిమిషాల్లోనే 10% నుండి 80% వరకు రీఛార్జ్ అవుతుంది. ఇది అందుబాటులోకి వస్తే టెస్లా వంటి దిగ్గజాల ఆధిపత్యానికి చావు తప్పదని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.
2023లో దాఖలు చేసిన పేటెంట్ ప్రకారం.. ఈ బ్యాటరీ అధిక-సాంద్రత కలిగిన సాలిడ్-స్టేట్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగిస్తుంది. మెరుగైన భద్రత, దీర్ఘ మన్నిక, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో రెండు ఇబ్బందులు ఉంటాయి. అవి తక్కువ రేంజ్, ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం పట్టడం. ఈ బ్యాటరీ కమర్షియల్‌గా పూర్తిగా అందుబాటులోకి వస్తే ఇక రేంజ్ గురించి ఆందోళనలు అక్కర్లేదు. ఛార్జింగ్ సమయాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది.
టెస్లాకు ముప్పు ఎందుకంటే..
టెస్లా అత్యంత అధునాతన మోడళ్లు గరిష్టంగా 400–500 మైళ్ల రేంజ్‌ను అందిస్తున్నాయి. వీటిని ఛార్జ్ చేయడానికి 15–30 నిమిషాలు పడుతోంది. హువావే ప్రోటోటైప్ పనితీరు, సౌలభ్యం రెండింటిలోనూ పురోగతిని సూచిస్తుంది. దీంతో బ్యాటరీ ఆవిష్కరణ కేంద్రాన్ని అమెరికా నుంచి చైనాకు మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయినప్పటికీ, ఈ బ్యాటరీ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. వాస్తవ ప్రపంచ పనితీరు ప్రయోగశాల ఫలితాలకు భిన్నంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "ఇది ఒక ఆశాజనక దశ, కానీ భారీ ఉత్పత్తి, వాహనాలలో ఇంటిగ్రేషన్ నిజమైన పరీక్ష" అని బెంగళూరుకు చెందిన ఈవీ పరిశోధకుడు డాక్టర్ అనిల్ మెహతా అన్నారు.
ఈ బ్యాటరీని ఎప్పుడు లాంచ్ చేసేదీ, ఏ వాహనంతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేది హువావే ఇంకా వెల్లడించలేదు. కానీ ఇలాంటి బ్యాటరీ రాబోతోందన్న వార్తలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ఈవీ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్న భారత్ వంటి మార్కెట్లలో మరింత చర్చనీయాంశంగా మారాయి.