ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ పాపులర్ పల్సర్ 150 బైక్‌ను మరింత ఆకర్షణీయంగా అప్ డేట్ చేసింది. దాని మెకానికల్ సెటప్‌లో ఎలాంటి మార్పులు లేకుండా చిన్నపాటి డిజైన్, ఫీచర్ మెరుగుదలలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పల్సర్ 150 ఇప్పుడు ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌తో వస్తోంది. కాగా బైక్‌లో ఇప్పుడున్న వేరియంట్‌లు అలాగే ఉంటాయి.
బజాజ్ 2026 ద్వితీయార్ధంలో పల్సర్ క్లాసిక్ శ్రేణిలో మార్పులు చేస్తుందని ఓవైపు ఊహాగానాలు నడుస్తుండగానే బజాజ్ ఆటో తన అత్యంత ఐకానిక్ మోటార్ సైకిళ్లలో ఒకటైన పల్సర్ 150ను రిఫ్రెష్ చేసింది. అప్‌డేటెడ్ పల్సర్ 150 శ్రేణి ధర రూ. 1.08 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. పల్సర్ 150 ఎస్‌డీ ధర రూ .1,08,772, పల్సర్ 150 ఎస్‌డీ యూజీ ధర రూ. 1,11,669లుగా ఉంది. ఇక టాప్-స్పెక్ అయిన పల్సర్ 150 టీడీ యూజీ ధర రూ. 1,15,481. (ఇవన్నీ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధరలు).
ఏం మారాయి..?
సమకాలీన మోడల్ బైక్‌లతో పోటీపడేలా బజాజ్ పల్సర్ 150లో అప్ డేటెడ్ గ్రాఫిక్స్ తో డీటైల్స్‌ను కాస్త మెరుగుపరిచి కొత్త కలర్ ఆప్షన్లు తీసుకొచ్చింది. ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌ను జోడించడం అత్యంత ముఖ్యమైన ఫంక్షనల్ అప్ గ్రేడ్. ఇది బైక్‌కు విజిబులిటీని పెంచడమే కాకుండా మొత్తం డిజైన్‌కే మోడ్రన్ టచ్ ఇస్తుంది.
పల్సర్ 150 బైకులోని 149.5 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పీఎం వద్ద 13.8 బీహెచ్‌పీ పవర్, 6,500 ఆర్‌పీఎం వద్ద 13.25 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
ఇక బ్రేకింగ్ హార్డ్ వేర్ విషయానికి వస్తే 260 మి.మీ ఫ్రంట్ డిస్క్, సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో రియర్ డ్రమ్ సెటప్ ఉన్నాయి. కాగా సస్పెన్షన్ పనిని టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు,ట్విన్ గ్యాస్-ఛార్జ్‌డ్ రియర్ షాక్ అబ్జార్బర్లు చూసుకుంటాయి.


