ప్రపంచాన్ని మార్చిన ఆలోచన.. అలా పుట్టింది ATM పిన్! | How It All Began The Story Behind the ATM PIN | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని మార్చిన ఆలోచన.. అలా పుట్టింది ATM పిన్!

Jun 30 2026 5:22 PM | Updated on Jul 1 2026 7:52 AM

How It All Began The Story Behind the ATM PIN

ప్రస్తుతం జేబులో పర్సు లేకపోయినా, చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ కార్డు.. దానికి తోడు నాలుగు అంకెల రహస్య కోడ్ (PIN) ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడైనా నిమిషాల్లో నగదును చేతిలోకి తెచ్చుకోవచ్చు. బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా, మన డబ్బుకు కొండంత భద్రతను ఇచ్చే ఈ 'ఏటీఎం పిన్' వెనుక ఓ ఆసక్తికరమైన, మరెంతో ఆశ్చర్యకరమైన చరిత్ర దాగుంది. కోట్లాది రూపాయల లావాదేవీలను కాపలా కాసే ఈ అద్భుత సాంకేతికతను కనిపెట్టిన మేధావికి అప్పట్లో దక్కిన పారితోషికం ఎంతో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసు కోవాల్సిందే!

1960ల కాలంలో బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా ప్రక్రియను సులభతరం చేసేందుకు అంతర్జాతీయంగా పరిశోధనలు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్‌కు చెందిన ఒక ఇంజనీరింగ్ సంస్థలో పనిచేస్తున్న జేమ్స్ గుడ్‌ఫెలో అనే స్కాటిష్ ఇంజనీర్ ఒక సరికొత్త ఆలోచన చేశారు. వినియోగదారుడి గుర్తింపును మానవ ప్రమేయం లేకుండా, యంత్రమే స్వయంగా ధృవీకరించేలా ఒక ప్లాస్టిక్ కార్డును, దానికి అనుసంధానంగా ఒక రహస్య సంఖ్యను (Personal Identification Number - PIN) కలిపి పనిచేసే సాంకేతికతను ఆయన 1966లో అభివృద్ధి చేశారు.

కేవలం 10 పౌండ్ల బహుమతి!
జేమ్స్ గుడ్‌ఫెలో కనిపెట్టిన ఈ పిన్ వ్యవస్థ బ్యాంకింగ్ రంగాన్నే మార్చేసింది. నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఏటీఎం కేంద్రాలు ఈ భద్రతా సూత్రం ఆధారంగానే నడుస్తున్నాయి. కానీ, ఇంతటి విప్లవాత్మక ఆవిష్కరణ చేసినందుకు గాను, ఆ రోజుల్లో ఆయన పనిచేస్తున్న సంస్థ ఆయనకు అందించిన బోనస్ ఎంతో తెలుసా? కేవలం 10 పౌండ్లు మాత్రమే!

ప్రస్తుత భారతీయ కరెన్సీ విలువ ప్రకారం చూస్తే ఇది సుమారు వెయ్యి రూపాయల లోపే ఉంటుంది."ఆవిష్కరణ నాదే అయినా, కంపెనీ నిబంధనల ప్రకారం నాకు దక్కిన బోనస్ కేవలం పది పౌండ్లు మాత్రమే" అని జేమ్స్ గుడ్‌ఫెలో తర్వాతి కాలంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం. లండన్‌లో మొదలైన ప్రస్థానం..

జేమ్స్ గుడ్‌ఫెలో ఈ సాంకేతికతను రూపొందించిన మరుసటి సంవత్సరమే, అంటే 1967లో లండన్ నగరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి నగదు పంపిణీ యంత్రాన్ని (Cash Machine) ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ సాంకేతికత ఖండంతరాలు దాటి విస్తరించింది. 1973 జూన్ 4న ఈ వ్యవస్థకు అమెరికాలో అధికారికంగా పేటెంట్ లభించడంతో, ఆధునిక ఏటీఎంల యుగం ఊపందుకుంది. భద్రతకు కేరాఫ్ అడ్రస్!.

నేడు మనం ఏటీఎం సెంటర్‌కు వెళ్లినప్పుడు తప్పుడు పిన్ నంబర్‌ను వరుసగా మూడు సార్లు నమోదు చేస్తే కార్డు బ్లాక్ అయిపోతుంది. మన ఖాతాలోని సొమ్ము సైబర్ నేరగాళ్ల పాలు కాకుండా అడ్డుకునే ఈ పటిష్టమైన భద్రతా వలయానికి పునాది వేసింది ఆ 10 పౌండ్ల ఆవిష్కరణే కావడం విశేషం. ఆర్థిక రంగాన్ని డిజిటల్ వైపు నడిపించిన ఈ స్కాటిష్ మేధావి సేవలను గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం, 2006లో ఆయనకు ప్రతిష్టాత్మక 'ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్' (OBE) గౌరవాన్ని అందించింది. పారితోషికం చిన్నదైనా, ఆయన అందించిన సాంకేతికత మాత్రం ప్రపంచ మానవాళికి అందించి సేవ అమూల్యమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు!.
- పసుపులేటి వెంకటేశ్వరరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement