ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ (EPFO) తీసుకురాబోతున్న ‘ఈపీఎఫ్ఓ 3.0’ వ్యవస్థపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. యూపీఐ, ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును సులభంగా ఉపసంహరించుకునే సదుపాయం అందుబాటులోకి రానుండటంతో ఉద్యోగుల్లో ఆనందం కనిపిస్తున్నా.. “పీఎఫ్ మొత్తం తీసుకుంటే పెన్షన్‌కు ప్రమాదమా?” అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది.
పీఎఫ్ విత్‌డ్రాకు, పెన్షన్‌కు సంబంధం లేదు
ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్), ఈపీఎస్ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) రెండూ ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నప్పటికీ, వాటి నిర్వహణ విధానం వేర్వేరుగా ఉంటుంది. ఉద్యోగి, యజమాని (కంపెనీ) చెల్లించే పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌తో ఏర్పడే ఈపీఎఫ్ బ్యాలెన్స్‌పై మాత్రమే కొత్త ఉపసంహరణ సదుపాయం వర్తిస్తుంది. అంటే ఏటీఎం లేదా యూపీఐ ద్వారా సభ్యులు తమ పీఎఫ్ నిధుల్లో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈపీఎస్ కింద వచ్చే నెలవారీ పెన్షన్ మొత్తాలను ఈ విధానంలో ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు.
10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే పెన్షన్ హక్కు
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 58 ఏళ్ల వయస్సు అనంతరం లభించే పెన్షన్ అర్హతపై ఈ మార్పుల ప్రభావం ఉండదు. ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నా, అతని ఈపీఎస్ సర్వీస్ కాలం రద్దు కావడం లేదా రీసెట్ కావడం జరగదు. అయితే పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల ఈపీఎస్ సభ్యత్వం తప్పనిసరి. ఆ అర్హత పూర్తి చేసిన సభ్యులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్‌కు అర్హులుగానే కొనసాగుతారు.
ఉదాహరణకు 50 ఏళ్ల ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతా నుంచి భారీ మొత్తాన్ని ఉపసంహరించుకున్నా, అతను ఇప్పటికే 10 ఏళ్ల అర్హత సర్వీస్ పూర్తి చేసి ఉంటే పెన్షన్ ప్రయోజనాలు కోల్పోడు. దీంతో ఉద్యోగుల్లో ఉన్న ప్రధాన సందేహానికి ప్రభుత్వం సమాధానం ఇచ్చినట్టైంది.
ఈపీఎఫ్ఓ 3.0 గురించి..
ఈపీఎఫ్ఓ 3.0 అనేది సంస్థ చేపడుతున్న పెద్ద డిజిటల్ మార్పు కార్యక్రమం. దీని ద్వారా సభ్యులు పూర్తిగా కాగితరహిత విధానంలో తమ పీఎఫ్ డబ్బును తక్షణమే బదిలీ చేసుకోవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు. యూపీఐ ఆధారిత చెల్లింపులు, యూపీఐ సపోర్ట్ ఉన్న ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో ఇప్పటివరకు ఉన్న క్లెయిమ్ ప్రాసెసింగ్ ఆలస్యాలు తగ్గి, సభ్యుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ కానుంది.
కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవియా ఇటీవల ఈ సేవల పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని వెల్లడించారు. యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా పీఎఫ్ ఉపసంహరణ వ్యవస్థను పరీక్షించామని, ఉపసంహరించిన మొత్తాన్ని నేరుగా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం సిద్ధమైందని తెలిపారు. అయితే ఈపీఎఫ్ఓ 3.0 అధికారిక ప్రారంభ తేదీని మాత్రం ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.
ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దాదాపు రూ.28 లక్షల కోట్ల కార్పస్‌ను నిర్వహిస్తోంది. భద్రత, స్థిరమైన రాబడులు, పన్ను మినహాయింపుల కారణంగా కోట్లాది మంది ఉద్యోగులు ఈ వ్యవస్థపై విశ్వాసం ఉంచుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 1.29 కోట్ల మందికి పైగా కొత్త కార్మికులు పేరోల్ వ్యవస్థలో చేరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


