సిటీలో గృహప్రవేశాలు ఆలస్యం! | Housewarmings delayed in Hyderabad city | Sakshi
Sakshi News home page

సిటీలో గృహప్రవేశాలు ఆలస్యం!

Jun 17 2026 5:44 AM | Updated on Jun 17 2026 5:44 AM

Housewarmings delayed in Hyderabad city

హైదరాబాద్‌లో 63,700 అపార్ట్‌మెంట్ల అప్పగింతలో జాప్యం 

రియల్‌ ఎస్టేట్‌ రంగంపై పెరిగిన ఇంధన ధరలు, రవాణా ఖర్చుల ప్రభావం... ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు కూడా పైపైకి.. 

గడువులోగా నిర్మాణాల పూర్తి బిల్డర్లకు సవాలే...

సాక్షి, హైదరాబాద్‌: యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ప్రజలను ఇళ్లకు పరిమితం చేస్తే పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఏకంగా ‘ఇళ్ల’పైనే పిడుగు వేసింది. పశ్చిమాసియా ద్వారా చమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడటం వల్ల ఇంధన ధరలతోపాటు రవాణా ఖర్చులు పెరిగి ఉక్కు, అల్యూమినియం, టైల్స్, రంగులు, విద్యుత్‌ ఉపకరణాల వంటి భవన నిర్మాణ సామగ్రి ధరలు ఎగబాకాయి. దీని ఫలితంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో గడువులోగా ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయడం బిల్డర్లకు సవాల్‌గా మారింది. 

కరోనా కంటే డేంజర్‌.. 
కరోనా కాలంలో 2020లో 4.66 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యానికిగాను 2.14 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. లాక్‌డౌన్లు, వలస కార్మీకులు సొంతూళ్లకు వెళ్లిపోవడం, రవాణా వ్యవస్థలో సవాళ్ల కారణంగా కేవలం 46 శాతమే ఇళ్ల డెలివరీ సాధ్యమైంది. మరోవైపు హైదరాబాద్‌ సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది 5,40,400 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గడువులోగా కొనుగోలుదారులకు అప్పగించాల్సి ఉండగా అందులో 87 శాతం యూనిట్ల డెలివరీలో బిల్డర్లు సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు అనరాక్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. ఇందులో 70 శాతం గృహాలు ముంబై, పుణే, బెంగళూరు నగరాల్లోనే ఉన్నాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 5.19 లక్షల ఇళ్లు డెలివరీ అవగా 2017 నుంచి 2025 మధ్య ఈ సంఖ్య దాదాపు 30.5 లక్షల యూనిట్లుగా ఉంది. 

హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి... 
రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనల ప్రకారం గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగించాల్సి ఉంటుంది. ఈ ఏడాది దక్షిణాది నగరాల్లో మొత్తం 1,68,300 యూనిట్లు డెలివరీ చేయాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా బెంగళూరులో 69 వేలు, హైదరాబాద్‌లో 63,700, చెన్నైలో 35,600 యూనిట్లు కొనుగోలుదారులకు అప్పగించాల్సి ఉంది. నిర్మాణ సామగ్రి కొరత, ధరల పెరుగుదల కారణంగా హైదరాబాద్‌లో ఆయా యూనిట్ల డెలివరీ ఈ ఏడాది ఆలస్యం కానుంది. 

రెరా గడువును పొడిగించాలి 
కరోనా కాలంలో ఎలాగైతే రెరా గడువులో మినహాయింపులు ఇచ్చారో అదే తరహాలో పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో రెరా గడువును ఏడాదిపాటు పొడిగించాలి. 
– ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్‌ తెలంగాణ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement