న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో టంగ్‌స్టన్ బ్లాక్‌ను అన్వేషించేందుకు, తవ్వకాలు చేపట్టేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందినట్లు హిందుస్థాన్ జింక్ తెలిపింది. ఆధునిక తయారీ పరికరాల్లో వినియోగించే విలువైన ఖనిజాల వెలికితీత వ్యాపారాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్న వేదాంత గ్రూప్‌నకు ఇదొక కీలక మైలురాయి. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో టంగ్‌స్టన్, సంబంధిత ఖనిజ బ్లాక్‌ను టెండర్‌లో దక్కించుకున్నాము.
ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి కాంపోజిట్(అన్వేషణ, తవ్వకాలు) లైసెన్స్ పొందాము’’ అని కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. క్రిటికల్, వ్యూహాత్మక ఖనిజాల్లో దేశం స్వయం ప్రతిపత్తిని సాధించడంతో తమ వంతు పాత్ర పోషిస్తామని కంపెనీ సీఈవో అరుణ్ మిశ్రా తెలిపారు. హిందుస్థాన్ జింక్‌లోనే అతిపెద్ద జింక్ ఉత్పత్తిదారు. వెండి ఉత్పత్తి చేసే తొలి అయిదు సిల్వర్ ఉత్పత్తిదారుల్లో స్థానం దక్కించుకుంది. దాదాపు 40కి పైగా దేశాలకు వెండిని సరఫరా చేస్తుంది. దేశీయ జింక్ మార్కెట్‌లో 77 శాతానికి పైగా మార్కెట్ వాటా కలిగి ఉంది.


