
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీడీపీల్లో భారత్ ఒకటిగా నిలవడం ఆశావాదానికి అద్దం పడుతోంది. అయితే దేశంలోని కార్పొరేట్ కంపెనీల లాభాలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నప్పుడు అందులో పని చేసే ఉద్యోగుల జీవితాలు, జీతాల్లో మాత్రం మార్పు ఉండడంలేదు. కార్పొరేట్ లాభాలను ఆయా యాజమాన్యాలు వ్యక్తిగతంగా ఎదగడానికి మాత్రమే ఖర్చు చేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ‘ది గ్రేట్ ఇండియన్ శాలరీ క్రైసిస్’ అని పిలుస్తున్నారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని చంకలు చరిచేలోపే.. శ్రామిక శక్తి ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు నివ్వెర పరుస్తున్నాయి.
దేశంలో ఆర్థిక పురోభివృద్ధి ఉన్నప్పటికీ సగటు కార్మికుడి పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా, వేతనాలు స్తబ్దుగా ఉన్నాయి. వారి సంపాదనకు, ఖర్చులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఉద్యోగుల శ్రమకు తగిన ప్రతిఫలం ఉండకపోవడంతో వారి ఆర్థిక ప్రణాళికలు అస్తవ్యస్తంగా మారి ప్రధాన నగరాల్లోని నిపుణులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
స్తబ్దుగా వేతనాలు
భారత జీడీపీ విస్తరిస్తున్నప్పటికీ జీతాల వృద్ధి మాత్రం గణనీయంగా మందగించింది. 2023 లో సగటు వేతన పెరుగుదల కేవలం 9.2% మాత్రమే ఉండడం దీనికి నిదర్శనం. ఈ పెంపు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లేదు. ద్రవ్యోల్బణం రేట్లు ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ఇతర నిత్యావసరాల ధరలు వేతనాల పెరుగుదలను మించిపోయాయి. కంపెనీలు రికార్డు లాభాలను నమోదు చేసేందుకు దోహదపడే ఉద్యోగుల వేతన పెంపుపై యాజమాన్యాలు మొండి వైఖరి అనుసరిస్తున్నాయి. సంపన్నులు, సగటు కార్మికుడి మధ్య ఆర్థిక అంతరం విస్తృతంగా పెరుగుతోంది. అధిక వేతనం పొందే రంగాల్లో కొంతమంది ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. తక్కువ ఆదాయ వర్గాల్లో ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం మూసివేత
పట్టణాల్లో మరింత ఖర్చులు
నోయిడా, ఢిల్లీ, చెన్నై, పుణె, బెంగళూరు, హైదరాబాద్.. వంటి ప్రధాన పట్టణ కేంద్రాల్లో నివసిస్తున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జీవన వ్యయం అదుపు తప్పడంతో నగరంలోని ఉద్యోగులు అధిక అద్దెలు, ఈఎంఐలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో సతమతమవుతున్నారు. ఓ పాతికేళ్ల కిందట మోస్తారు ఖర్చులతో కాలం వెళ్లదీసుకొచ్చినవారికి ఇప్పుడు అవే ఖర్చులు ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేస్తున్నాయి.