
ప్రపంచ టాప్ టెక్ కంపెనీలో ఒకటైన మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ కార్యాలయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌లో తన కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశంలో 25 సంవత్సరాలుగా సర్వీసులు అందిస్తున్న కంపెనీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో స్థానికంగా తన సర్వీసులను ముగించినట్లయింది. కంపెనీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ తగ్గింపు వ్యూహంలో భాగంగా పాకిస్థాన్‌లో ఈమేరకు మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇప్పటికే స్థానికంగా ఉన్న క్లయింట్లకు క్షేత్రస్థాయిలో సర్వీసులు అందించేందుకు కంపెనీ ప్రాంతీయ కేంద్రాలు, అధీకృత రీసెల్లర్ల ద్వారా రిమోట్ సేవలు అందిస్తామని పేర్కొంది. ప్రస్తుత కస్టమర్ ఒప్పందాలు, సేవలు ప్రభావితం కాకుండా కొనసాగుతాయని తెలిపింది. ఆయా కంపెనీలకు నిత్యం మద్దతుగా నిలుస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. పాకిస్థాన్‌లో కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల స్థానికంగా కేవలం కొద్దిమంది ఉద్యోగులు మాత్రమే ప్రభావితం చెందినప్పటికీ అక్కడి వ్యాపార, సాంకేతిక వర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.
భారతదేశంలో మాదిరిగా కాకుండా మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్‌లో అభివృద్ధి లేదా ఇంజినీరింగ్ సర్వీసులు స్థాపించేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. కేవలం అక్కడి యూనిట్ ద్వారా తన ప్రోడక్ట్‌లను ఇతర కంపెనీలతో అనుసంధానం చేసేందుకు, అమ్మకాల కార్యకలాపాలకే పరిమితం చేసింది. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఉద్యోగాల కోతకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇటీవల మొత్తంగా కంపెనీలో పని చేస్తున్న 9,000 పైగా ఉద్యోగాలను తగ్గించింది. ఈ విస్తృత సంస్థాగత పునర్నిర్మాణమే సంస్థ పాకిస్థాన్ నుంచి నిష్క్రమించేందుకు కారణమని ఆ దేశ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాస్తవానికి మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పాక్ లైసెన్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్ వంటి ప్రధాన విధులను కొన్ని సంవత్సరాలుగా ఐర్లాండ్‌లోని తన యూరోపియన్ హబ్‌కు మారుస్తోంది.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపికబురు
అంతర్జాతీయంగా చాలాదేశాల్లో పాకిస్థాన్ ఉగ్రవాదానికి సంబంధించి వ్యతిరేకత ఉంది. స్థానికంగా పేదరికం పెరుగుతోంది. పాక్ ఆర్థిక వ్యవస్థ ఏటా దారుణంగా క్షీణిస్తోంది. దాంతో చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను పరిమితం చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీ ఇలా మొత్తంగా తన కార్యాలయాన్ని షట్‌డౌన్ చేయడం అక్కడి టెక్ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది.