
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 2025 నుంచి కరువు భత్యం (డీఏ) 4 శాతం పెరిగే అవకాశం ఉందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. వాటిలోని వివరాల ప్రకారం ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ఈమేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 55 శాతం డీఏను 59 శాతానికి పెంచాలని యోచిస్తోంది. ఈ పెంపు జులై నుంచి అమల్లోకి రానుండగా ఆగస్టు లేదా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పండుగ సీజన్‌కు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
సీపీఐ డేటా ఆధారంగా..
డీఏ లెక్కింపునకు ఆధారమైన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ) 2025 మేలో 0.5 పాయింట్లు పెరిగి 144కు చేరింది. గత మూడు నెలల్లో సూచీ స్థిరమైన పెరుగుదలను చూపించింది. ఇది మార్చిలో 143, ఏప్రిల్లో 143.5, మేలో 144గా ఉంది. ఇండెక్స్ ఇదే జోరును కొనసాగించి జూన్‌లో 144.5కు పెరిగితే ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ 12 నెలల సగటు 144.17కు చేరుకుంటుందని అంచనా. 7వ వేతన సంఘం ఫార్ములాను ఉపయోగించి డీఏను సర్దుబాటు చేసినప్పుడు ఇది సుమారు 58.85% రేటుగా మారుతుంది. దాంతో 2025 జులై నుంచి 59 శాతం డీఏకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: పాత వాహనాలపై నిషేధం ఎత్తివేత
7వ వేతన సంఘం డీఏ పెంపు ఫార్ములా
డియర్నెస్ అలవెన్స్‌ను ఏడాదికి రెండుసార్లు జనవరి, జులైలో సవరిస్తారు. గత 12 నెలల్లో ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ డేటా సగటు ఆధారంగా ఈ డీఏను లెక్కిస్తారు. ఇందుకోసం ఉపయోగించే ఫార్ములా కింది విధంగా ఉంటుంది.
డీఏ(%) = [(గత 12 నెలల సగటు సీపీఐ ఐడబ్ల్యూ- 261.42)/261.42]*100
దాని ప్రకారం..
డీఏ(%) = [(144.17-261.42)/261.42]*100=58.85 శాతం.
ఇక్కడ, 261.42ను గతేడాది గణాంకాల ప్రకారం లెక్కింపునకు మూల విలువగా పరిగణిస్తారు. పై ఫ్యార్ములాలో మైనస్ వ్యాల్యూ వస్తుంది. దీన్ని సవరించి దనాత్మకంగా లెక్కిస్తారు. ఈ పద్ధతిని ఉపయోగించి ఈసారి డీఏ పెరుగుదలను 4 శాతంగా అంచనా వేశారు.