
దేశరాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని ఎదుర్కోవడానికి పాత వాహనాల నిషేధానికి సంబంధించి ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన విధానాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కేవలం వాహనాల కొనుగోలు తేదీని బట్టి ఆటోమేటిక్ స్క్రాపింగ్ లేదా సీజ్ చేసే ప్రక్రియను అధికారులు ఇకపై కొనసాగించరని పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు.
పదేళ్లకు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాలను ఢిల్లీలో నడపకుండా నిషేధించాలన్న దీర్ఘకాలిక విధానాన్ని ఈ నిర్ణయంతో నిలిపేశారు. వాస్తవ ఉద్గారాలతో సంబంధం లేకుండా తమ వాహనాలను బాగా నిర్వహించిన వారికి లేదా క్లీనర్ టెక్నాలజీలను ఏర్పాటు చేసిన వారికి ఇది నష్టం కలిగిస్తుందని కొందరి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
‘పాలసీ ఫ్రేమ్‌వర్క్‌పై పునరాలోచన చేస్తున్నాం. ఇప్పుడు కేవలం వాహనాల వయసుపై కాకుండా వాస్తవ ఉద్గారాలపై దృష్టి సారించాం’ అని సిర్సా విలేకరుల సమావేశంలో చెప్పారు. పాత వాహనాలనే కాకుండా కాలుష్య కారకాలను లక్ష్యంగా చేసుకునే శాస్త్రీయ, సాంకేతిక ఆధారిత విధానాన్ని తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: ఏకకాలంలో నాలుగైదు ఉద్యోగాలు.. తీరా దొరికాక..
రూ.లక్షలు పోగేసి కొన్న వాహనాలను మెరుగ్గా నిర్వహిస్తున్నా, నిబంధనలకు లోబడి కాలుష్యకారకాలను నియంత్రిస్తున్నా ఏకమొత్తంగా వాహనాల వయసురీత్యా పాలసీలు అమలు చేయడం తగదని కొందరు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రంగా విమర్శించారు. దాంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. సోషల్‌మీడియాలో ‘రూ.84 లక్షలతో రేంజ్ రోవర్ కారు కొన్ని ఎనిమిదేళ్లు అవుతుంది. కొవిడ్ కారణంగా రెండేళ్లు ఇంట్లోనే పార్క్ చేశాను. మొత్తంగా ఆ కారులో 74 వేల కి.మీ మాత్రమే ప్రయాణించాను. కారు మంచి కండిషన్‌లో ఉంది. కానీ నిబంధనల ప్రకారం ఇప్పుడు చౌకగా అమ్మాల్సి వస్తుంది’ అనేలా పోస్టులు వెలిశాయి.