
ఏకకాలంలో నాలుగైదు అమెరికా స్టార్టప్‌ల్లో ఉద్యోగం చేస్తూ వార్తల్లో నిలిచిన అమెరికాకు చెందిన భారతీయ టెక్ ప్రొఫెషనల్ సోహమ్ పరేఖ్ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించిన ఆయన అందుకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. ఆర్థిక ఒత్తిళ్ల వల్లే తాను ఒకేసారి రిమోట్‌గా నాలుగైదు కంపెనీల్లో పని చేయాల్సి వచ్చిందన్నారు. అందుకు అత్యాశ కారణం కాదని తెలిపారు.
బహుళ ఉద్యోగాలు.. అంగీకరించిన పరేఖ్
టీబీపీఎన్ షోలో పాల్గొన్న పరేఖ్‌ను తనపై వస్తున్న ఆరోపణలు నిజమేనా అని ప్రశ్నించగా ఆయన వాటిని అంగీకరించారు. ‘నేను ఒకేసారి పలు కంపెనీల్లో పనిచేశాను. కొందరివల్ల అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ ప్రక్రియలో నా ఉద్యోగ స్థితిగతులను తప్పుగా చూపించారు. వ్యక్తిగత లాభం కోసం అక్రమాలకు పాల్పడ్డారని పలువురు ఆరోపించారు. కానీ నేను లాభాపేక్షతో అలా చేయలేదు. ఆర్థిక ఒత్తిళ్లతోనే అలా బహుళ కంపెనీల్లో పని చేయాల్సి వచ్చింది’ అన్నారు.
గర్వపడటం లేదు
‘వారానికి 140 గంటలు పనిచేయడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ నా అవసరాన్ని బట్టి అలా చేయవలసి వచ్చింది’ అని వివరించారు. వృత్తిపరంగా మనుగడ, ఆర్థిక స్థిరత్వమే కీలకమని భావించి క్లిష్ట సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మీరు చట్టాలను ఉల్లంఘించారని విశ్వసిస్తున్నారా అని అడిగినప్పుడు, పరేఖ్ అందుకు పూర్తి బాధ్యత స్వీకరిస్తానని చెప్పారు. ‘నేను చేసిన పనికి గర్వపడటం లేదు. ఇది సమర్థించే విషయం కాదు’ అని అన్నారు. పలు ఉద్యోగాలు చేస్తూ జూనియర్ డెవలపర్లను ఉపయోగించుకున్నారనే ఆరోపణలను ఆయన ఖండించారు. అందులో నిజం లేదన్నారు.
సోహమ్ పరేఖ్ ఎవరు?
ముంబైకి చెందిన పరేఖ్ ఉన్నత చదువుల కోసం 2018లో అమెరికా వెళ్లాలని భావించాడు. కానీ ఆర్థిక సమస్యల వల్ల తాను వెళ్లడం ఆలస్యం అయింది. చివరకు 2020లో అమెరికాకు వెళ్లాడు. అతను 2020లో ముంబై విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత 2022లో జార్జియా టెక్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు.
ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! మళ్లీ కరుగుతోన్న బంగారు కొండ..
విశ్లేషణ సంస్థ మిక్స్ పానెల్ సహ వ్యవస్థాపకుడు సుహైల్ దోషి అమెరికా స్టార్టప్ కంపెనీలను సోహమ్ పరేఖ్ మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయన వెలుగులోకి వచ్చాడు. పరేఖ్ ఒకేసారి నాలుగైదు స్టార్టప్‌ల్లో పనిచేస్తున్నారని చెప్పారు. విమర్శలు వస్తున్నప్పటికీ పరేఖ్ ఈ వ్యవహారంతో పాఠాలు నేర్చుకున్నానని, ఆ తప్పులు పునరావృతం చేసే ఆలోచన లేదని చెప్పాడు.