వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు దాఖలు చేసేందుకు తీసుకొచ్చిన ఈ–జాగృతి ప్లాట్‌ఫామ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. జనవరి 1న దీన్ని ప్రారంభించగా, ఇప్పటి వరకు 2.75 లక్షల మంది ఈ ప్లాట్‌ఫామ్‌పై తమ పేర్లను నమోదు (రిజిస్టర్డ్ యూజర్లు) చేసుకున్నారు. ఇందులో 1,388 మంది ఎన్‌ఆర్‌ఐలు కూడా ఉన్నారు.
ఫిర్యాదుల కోసం ఓసీఎంఎస్, ఈ–దాఖిల్, ఎన్‌సీడీఆర్‌సీ సీఎంఎస్, కాన్ఫోనెంట్ పోర్టళ్లు అందుబాటులో ఉండగా, వీటన్నింటినీ ఏకీకృతం చేస్తూ ఇ–జాగృతి ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తీసుకురావడం గమనార్హం. దేశవ్యాప్తంగా వినియోగదారులు ఫిర్యాదులు దాఖలు చేసేందుకు, అత్యాధునిక టెక్నాలజీతో ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు.
నవంబర్ 13 నాటికి 1,30,550 ఫిర్యాదులు దాఖలైనట్టు.. ఇందులో 1,27,058 ఫిర్యాదులకు పరిష్కారం చూపించినట్టు వినియోగ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఎన్‌ఆర్‌ఐలు విదేశాల నుంచే తమ వినియోగ హక్కులను ఈ ప్లాట్‌పామ్ ద్వారా కాపాడుకోవచ్చని పేర్కొంది. ఈ ప్లాట్‌ఫామ్‌తో భౌగోళిక పరమైన అవరోధాలు వారికి తొలగినట్టయిందని తెలిపింది.
మీరూ ఫిర్యాదు చేస్తారా?
మొదట ఇ-జాగృతి అధికారిక వెబ్ సైట్ కు వెళ్లండి
తొలిసారి యూజర్ అయితే, మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్, మీరు వినియోగదారా లేక ఇతరులా అన్న వివరాలు నమోదు చేయండి.
ఇప్పుడు వెరిఫికేషన్ ఓటీపీ ఎంటర్ చేసి పాస్‌వర్డ్ ఎంచుకోండి. చిరునామా, గుర్తింపు రుజువు వివరాలు ఇచ్చి రిజిస్టర్ పూర్తి చేయండి
కొత్త కంప్లయింట్ ఇలా..
లాగిన్ అయిన తరువాత, మీ డ్యాష్ బోర్డ్ మీద "ఫైల్ న్యూ కేస్" ఎంచుకోండి. తర్వాత కేసు టైప్‌ను ఎంచుకుని ‘కన్స్యూమర్ కంప్లయింట్’పై క్లిక్ చేయండి.ఇప్పుడు ఫిర్యాదు అవసరమైన డాక్యుమెంట్‌లు, రుసుము వివరాలు కనిపిస్తాయి.
వస్తువులు లేదా సేవల కోసం మీరు చెల్లించిన మొత్తం, ఇప్పుడు ఎంత పరిహారం కోరుకుంటున్నారు, తేదీ, మీ రాష్ట్రం, జిల్లా, కేటగిరీ, సబ్ కేటగిరి తదితర వివరాలు నమోదు చేయండి.
కొనుగోలు రసీదులు, వారితో లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
చివరగా మొత్తం వివరాలను ఒకసారి సరిచూసుకుని సంబంధిత రుసుము చెల్లించి సబ్‌మిట్ చేయండి.


