
99.9 శాతం స్వచ్ఛతగల బంగారం
10 గ్రాములు ఢిల్లీలో రూ.1,15,100
ఒక్క రోజులో రూ.1,800 పెరుగుదల
డాలర్ బలహీనత, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో పసిడిలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్న ఫలితం
న్యూఢిల్లీ: దేశీయంగా పసిడి ధరలు మంగళవారం సరికొత్త రికార్డును సృష్టించాయి. 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,800 పెరిగి రూ.1,15,100 స్థాయికి చేరింది. ఇదొక సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి. డాలర్ బలహీనత, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండడంతో ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదవుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం కొత్త గరిష్టానికి చేరింది.
కిలోకి రూ.570 పెరిగి రూ.1,32,870 స్థాయిని నమోదు చేసింది. యూఎస్ ఫెడ్ సెపె్టంబర్ భేటీలో భారీ రేట్ల కోత దిశగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తీసుకురావడం బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూఎస్ డాలర్ బలహీనతకు తోడు, ఫెడ్ ఒకటికి మించిన రేట్ల కోతను చేపడుతుందన్న అంచనాలతో మంగళవారం బంగారం ధర సరికొత్త గరిష్టానికి చేరినట్టు చెప్పారు.
పది వారాల కనిష్టానికి డాలర్ ఇండెక్స్ బలహీనపడినట్టు తెలిపారు. రేట్ల కోత దిశగా ఫెడ్ సానుకూల వైఖరి, భారత్, చైనాతో అమెరికా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన పరిణామాలతో ట్రేడర్లు బంగారంలో లాంగ్ పొజిషన్లను కొనసాగిస్తున్నట్టు ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం లాభాలతో కొనసాగుతూ 3,739 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట స్థాయి నమోదు చేసింది.