దిగొచ్చిన ఇంధన ధరలు! | Fuel Prices Slashed 5 Off Petrol, 3 Off Diesel Nationwide By Nayara Energy | Sakshi
Sakshi News home page

దిగొచ్చిన ఇంధన ధరలు!

Jul 1 2026 12:07 PM | Updated on Jul 1 2026 12:49 PM

Fuel Prices Slashed 5 Off Petrol, 3 Off Diesel Nationwide By Nayara Energy

కొంతకాలంగా పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ఉద్రిక్తతలతో అల్లాడిపోతున్న ఇంధన వినియోగదారులకు అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఊరట లభించింది. ఇరాన్ వివాదం సడలడం, కీలకమైన సముద్ర రవాణా మార్గాలు పునప్రారంభం కావడంతో అంతర్జాతీయంగా ముడిచమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) సరఫరాలు మళ్లీ గాడిలో పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అంతరాయాలపై ఆందోళనలు తొలగిపోవడంతో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా తగ్గిన ముడిచమురు ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ ప్రైవేట్ రంగ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ రిటైల్ నెట్‌వర్క్‌లో పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను లీటరుకు రూ.3 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఇంధన ధరలను తగ్గించిన మొదటి రిటైలర్‌గా నయారా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న నయారాకు చెందిన 7,000 ఇంధన స్టేషన్లలో ఈ సవరించిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. అయితే, స్థానిక పన్నులు (వ్యాట్) ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో తుది రిటైల్ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

మార్చి నాటి పెంపు ఉపసంహరణ

గతంలో ఇరాన్ వివాదంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఎగబాకడంతో.. మార్చి 26న నయారా సంస్థ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచింది. తాజా తగ్గింపుతో ఆ పెంపును సంస్థ పూర్తిగా వెనక్కి తీసుకున్నట్లయింది. గ్లోబల్ మార్కెట్ స్థిరీకరణ తర్వాత ఇంధన ధరల్లో వచ్చిన మొదటి తగ్గుదల సవరణ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం గుజరాత్‌లోని వడినార్‌లో తమ 20 మిలియన్ టన్నుల (వార్షిక సామర్థ్యం) రిఫైనరీ టర్నరౌండ్‌ను పూర్తి చేసుకుని దేశీయ డిమాండ్‌ను అందుకునేందుకు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వ రంగ సంస్థల్లో మార్పు లేదు!

ప్రైవేట్ రంగ సంస్థ నయారా ధరలను తగ్గించినప్పటికీ ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు మాత్రం ఇంకా పాత ధరలనే కొనసాగిస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు దేశంలోని లక్షకు పైగా ఇంధన స్టేషన్లలో 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. కాగా, ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.12 గాను, డీజిల్ ధర లీటరుకు రూ.95.20 గాను కొనసాగుతోంది.

ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్‌ఆఫ్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement