
టీసీఎస్ క్యూ1 ఫలితాలు కీలకం...
విదేశీ నిధుల ప్రవాహం పైనా దృష్టి...
ఈ వారం మార్కెట్ గమనంపై విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ: మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే పలు కీలక సంఘటనలు ఈ వారంలో చోటు చేసుకోన్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ వార్‌పై కీలక ప్రకటన వెలువడనుంది. అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలకు 90 రోజుల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకోగా.. భారత్ కూడా వాణిజ్య చర్చల్లో తలమునకలైంది. ఈ సంప్రదింపులు విజయవంతమై, డీల్ గనుక కుదిరితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా వాణిజ్య సంబంధ రంగాలకు ఈ ఒప్పందం బూస్ట్ ఇస్తుందని చెబుతున్నారు. ‘ఈ వారం ఒక్క భారత్ మార్కెట్లకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు చాలా కీలకం కానుంది. ఉత్కంఠ రేపుతున్న జూలై 9 అమెరికా టారిఫ్ డెడ్‌లైన్ దగ్గరకొచి్చంది. ప్రపంచ వాణిజ్య స్థితిగతులను ఇది మార్చేయనుంది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ అదే రోజున విడుదల చేసే పాలసీ మినిట్స్ కూడా మార్కట్లపై ప్రభావం చూపుతుంది’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా పేర్కొన్నారు.
ఫలితాల సీజన్.. టీసీఎస్ బోణీ
కార్పొరేట్ ఫలితాల సీజన్ మళ్లీ మొదలవుతోంది. ఈ నెల 10న టీసీఎస్ క్యూ1 (2025–26, ఏప్రిల్–జూన్ క్వార్టర్) ఫలితాల బోణీ కొట్టనుంది. అదే రోజున టాటా ఎలెక్సీ కూడా ఫలితాలను ప్రకటించనుంది. ఈ వారంలోనే 11న అవెన్యూ సూపర్‌మార్ట్, ఆదిత్య బిర్లా మనీ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా మార్కెట్ ఫోకస్ క్యూ1 ఫలితాల వైపు మళ్లనుంది. ‘భారత్–యూఎస్ మధ్య వాణిజ్య చర్చల్లో సానుకూల ఫలితం వెలువడితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ వంటి రంగాలకు ఇది జోష్ ఇస్తుంది. మార్కెట్లు ఇప్పుడు పై స్థాయిల్లోనే కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న క్యూ1 ఫలితాలు కూడా సూచీల గమనానికి దిశా నిర్దేశం చేస్తుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
క్రూడ్, రూపాయి ట్రెండ్...
బ్రెంట్ క్రూడ్ ధరల ట్రెండ్, డాలర్‌తో రూపాయి మారకం విలువ కదలికలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. అదేవిధంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడుల ధోరణి కూడా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. ‘ఎఫ్‌ఐఐలు మళ్లీ కొనుగోళ్ల బాట పట్టడానికి రెండు అంశాలు కీలకం కానున్నాయి. భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదరితే మార్కెట్లకు సానుకూలాంశం. ఎఫ్‌ఐఐలు మళ్లీ పెట్టుబడులకు సై అంటారు.
అలాగే క్యూ1 ఫలితాల్లో రికవరీ సంకేతాలు కనిపించడం కూడా సానుకూలంగా నిలుస్తుంది. ఈ రెండింటి విషయంలో నిరుత్సాహం ఎదురైతే మార్కెట్‌పైనా, ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మొత్తంమీద చూస్తే ఇండో–యూఎస్ వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కోసం వేచిచూసే ధోరణి, క్యూ1 ఫలితాలపై అంచనాల నేపథ్యంలో మార్కెట్లు కన్సాలిడేషన్‌లో ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమ్కా వ్యాఖ్యానించారు.
గత వారమిలా...
దేశీ సూచీలు గత వారంలో రివర్స్ గేర్ వేశాయి. బీఎస్‌ఎస్‌ఈ సెన్సెక్స్ 626 పాయింట్లు (0.74%), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 176 పాయింట్లు (0.68%) చొప్పున నష్ట పోయాయి.
జూలైలో ఎఫ్‌పీఐలు ఆచితూచి...
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఆర్‌బీఐ రేట్ల కోత వంటి సానుకూలతల నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) గత నెలలోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. రూ.14,590 కోట్లు ఈక్విటీల్లో వెచ్చించారు. వెరసి వరుసగా మూడో నెలలోనూ పెట్టుబడుల బాటలోనే కొనసాగారు. అయితే, ఈ నెలలో మళ్లీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తొలి వారంలో రూ.1,421 కోట్ల అమ్మకాలు జరిపారు. ముఖ్యంగా అమెరికా ట్రేడ్ వార్ డెడ్‌లైన్ దగ్గరపడటం, క్యూ1 ఫలితాల సీజన్‌పై అంచనా అంచనాల నేపథ్యంలో ఎఫ్‌పీఐలు ప్రస్తుతానికి ఆచితూచి వ్యవహరిస్తున్నారని ఏంజెల్ వన్ సీనియర్ ఫండమెంటల్ ఎనలిస్ట్ వకార్‌జావెద్ ఖాన్ తెలిపారు. స్వల్పకాలానికి విదేశీ నిధుల ప్రవాహంలో తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చని పేర్కొన్నారు. 2025లో ఇప్పటిదాకా రూ.79,322 కోట్లను ఎఫ్‌పీఐలు వెనక్కి తీసుకోవడం గమనార్హం.