
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘క్రాఫ్టెడ్ బై భారత్’ (Crafted by Bharat) పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ఈ సేల్ 10వ ఎడిషన్‌ది. భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశీయ కళాకారులు, చేనేతలు, మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ నిర్వహిస్తోంది.
ఈ ఒక్కరోజు ప్రత్యేక సేల్‌లో 1.4 లక్షలకు పైగా హస్తకళా ఉత్పత్తుల విక్రయానికి అవకాశం కల్పిస్తారు. 2,200 మందికి పైగా కళాకారులు, స్వయం సహాయక సంఘాలు, మహిళా వ్యాపారవేత్తలు పాల్గొంటున్నారు. వార్లీ, పటచిత్ర, మధుబని, పిచ్వాయి, టెర్రకోటా, ప్రాంతీయ చెక్క కళాకృతులు, హోమ్ డెకోర్, ఫర్నిచర్, వంటగది వస్తువులు, దుస్తులు మొదలైనవి ఈ ప్రత్యేక సేల్‌లో అందుబాటులో ఉంటాయి. భదోహి, హత్రాస్, మధురై, కన్నౌజ్, రామనగర, ఉజ్జయిని వంటి చిన్న పట్టణాల మహిళలు తమ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు ఈ సేల్ అవకాశం కల్పిస్తోంది.
ఏటా నిర్వహించే ఈ సేల్‌లో ఈసారి 100 మందికిపైగా కొత్త విక్రేతలు చేరారు. ఎంఎస్‌ఎంఈలు, స్థానిక కళాకారులకు సాధికారత కల్పిస్తూ తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్ వేదికగా విక్రయించుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ మిషన్ సహకారం అందిస్తోంది.