
ఉపాధి కల్పన లక్ష్యాల్లో భాగంగా ప్రకటించిన రూ.1.07 లక్షల కోట్ల ఉద్యోగాల ఆధారిత ప్రోత్సాహక (ఈఎల్‌ఐ) స్కీమ్ అమలు కోసం డిజిటల్ సాధనాలతో పటిష్టమైన వ్యవస్థను కార్మిక శాఖ రూపొందించింది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్‌వో నిర్వహించే సామాజిక భద్రత స్కీముల ద్వారా దీన్ని అమలు చేయనుంది. ఇటు ఉద్యోగులు, అటు సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈఎల్‌ఐ స్కీమును తీర్చిదిద్దినట్లు కార్మిక శాఖ మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
ప్రయోజనాలను నేరుగా ఖాతాలకు బదిలీ చేసే విధంగా ఇది ఉంటుందని వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్‌వై) అమల్లో అవినీతి, ఫేక్ క్లెయిమ్‌ల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, మళ్లీ అలాంటి ఉదంతాలు చోటు చేసుకోకుండా ఈ స్కీమును పటిష్టంగా తీర్చిదిద్దినట్లు మంత్రి పేర్కొన్నారు. తయారీ రంగంపై ప్రత్యేక దృష్టితో, వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగయోగ్యత, సామాజిక భద్రతను పెంపొందించడం ఈఎల్‌ఐ స్కీము ప్రధాన ఉద్దేశం. దీనితో వచ్చే రెండేళ్లలో 3.5 కోట్లకు ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల వేతనం (రూ.15,000 వరకు) ఈ స్కీము కింద లభిస్తుంది. అదనంగా ఉద్యోగాలను కల్పించనందుకు అటు వ్యాపార సంస్థలకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయి. తయారీ రంగానికి మరో రెండేళ్లు అదనంగా ప్రయోజనాలు అందుతాయి. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు కల్పించే ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది.