
ద్వితీయార్ధంలో జోరుగా హైరింగ్
2.16 లక్షల తాత్కాలిక ఉద్యోగాల కల్పన
రిటైల్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో నియామకాలు
అడెకో ఇండియా నివేదిక
ముంబై: ఈసారి పండుగ సీజన్‌లో కంపెనీలు పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకోనున్నాయి. దీంతో 2025 ద్వితీయార్థంలో 2.16 లక్షల పైచిలుకు గిగ్, తాత్కాలిక ఉద్యోగాలు రానున్నాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే కొలువులు 15–20 శాతం పెరగనున్నాయి. రిటైల్, ఈ–కామర్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, లాజిస్టిక్స్, ఆతిథ్య, ట్రావెల్, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాల్లో ఈ ఉద్యోగాలు రానున్నాయి.
వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వివిధ వేదికల్లో తమ క్లయింట్లు పోస్ట్ చేసే ఖాళీలు, పరిశ్రమ నివేదికలు మొదలైన డేటా ఆధారంగా అడెకో ఇండియా దీన్ని రూపొందించింది.
రాఖీ, దసరా, దీపావళిలాంటి పండుగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఉద్దేశంతో నియామకాలు పుంజుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. సాధారణం కంటే ఈసారి పండుగ సీజన్ మెరుగ్గా ఉంటుందనే అంచనాలతో కంపెనీలు హైరింగ్ ప్రక్రియను కాస్తంత ముందుగానే మొదలుపెట్టాయని వివరించింది.
వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడటం, సానుకూల వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడం, ఆర్థిక పరిస్థితులపై ఆశావహ అంచనాలు నెలకొనడం, సీజనల్ అమ్మకాల విషయంలో కంపెనీలు దూకుడుగా ప్రచారం చేస్తుండటం వంటి అంశాలు ఈసారి హైరింగ్‌కి దన్నుగా నిలుస్తున్నట్లు నివేదిక వివరించింది.
‘ఈ పండుగ సీజన్‌లో డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. దానికి తగ్గట్లుగా పరిశ్రమ కూడా సన్నాహాలు చేసుకుంటోంది. గతంలో కంపెనీలు సంఖ్యాపరంగా ఎంత మందిని తీసుకున్నాం అనేదే చూసేవి. కానీ ఇప్పుడు, అభ్యర్థ్ధులు ఎంత త్వరగా ఉద్యోగంలో చేరగలరు, ఎంత సన్నద్ధంగా ఉన్నారు, వివిధ ప్రాంతాల్లో పరిస్థితులకు ఎంత వేగంగా సర్దుకోగలరులాంటి అంశాలపై కూడా కంపెనీలు దృష్టి పెడుతున్నాయి‘ అని అడెకో ఇండియా డైరెక్టర్ దీపేశ్ గుప్తా తెలిపారు.
నివేదికలో మరిన్ని విశేషాలు..
→ హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణెలాంటి పెద్ద నగరాల్లో సీజనల్ హైరింగ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే అవకాశాలు 19% అధికం.
→ లక్నో, జైపూర్, కోయంబత్తూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, మైసూరు, వారణాసిలాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా డిమాండ్ 42% పెరిగింది. విజయవాడ, కాన్పూర్, కొచ్చిలాంటి వర్ధమాన హబ్‌లలోనూ హైరింగ్ అంచనాలు మెరుగ్గా న్నాయి.
→ మెట్రో మార్కెట్లలో వేతనాలు 12–15%, వర్ధ మాన నగరాల్లో 18–22% స్థాయిలో పెరగవచ్చు.
→ స్వల్పకాలిక ఈ ఏడాది సీజనల్ హైరింగ్‌లో మహిళల వాటా 23 శాతం పెరగనుంది.
→ పండుగ సీజన్‌లో డిమాండ్ భారీగా ఉన్న సమయాల్లో కంపెనీలు లాస్ట్–మైల్ కార్యకలాపాలను (కస్టమర్ల ఇంటి దగ్గరకే ఉత్పత్తులను చేర్చడం) కూడా పటిష్టపర్చుకోనుండటంతో లాజిస్టిక్స్, డెలివరీల్లో హైరింగ్ 30–35% ఎగబాకనుంది.
→ బీఎఫ్‌ఎస్‌ఐ రంగాన్ని తీసుకుంటే .. క్రెడిట్ కార్డుల అమ్మకాలు, పీవోఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) ఇన్‌స్టాలేషన్ల కోసం (ముఖ్యంగా ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల్లో) కంపెనీలు పెద్ద స్థాయిలో నియామకాలు చేపడుతున్నాయి. ఈ విభాగంలో డిమాండ్ 30 శాతం పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.
→ హాస్పిటాలిటీ, ట్రావెల్ సెగ్మెంట్లలో రిక్రూట్‌మెంట్ డిమాండ్ 20–25% ఉండొచ్చు.
→ మొత్తం సీజనల్ ఉద్యోగాల కల్పనలో 35–40% వాటాతో రిటైల్, ఈ–కామర్స్ విభాగాల ఆధిపత్యం కొనసాగనుంది.
→ డిజిటల్‌పై పట్టు, బహుభాషా సామర్థ్యాలు, కస్టమర్లను హ్యాండిల్ చేయగలిగే నైపుణ్యాలకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నా యి. ఇన్–స్టోర్ సేల్స్, క్రెడిట్ కార్డ్ ప్రమోషన్లు, డెలివరీ ఉద్యోగాల కోసం ఈ నైపుణ్యాలను చూస్తున్నాయి.