పుంజుకుంటున్న పసిడి కొనుగోళ్లు...
పండుగ సీజన్‌పై జ్యువెలర్ల ఆశలు..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా మార్కెట్ సర్వేలో వెల్లడి
బంగారం ధరలు దిగిరావడం, మరింత స్థిరంగా కొనసాగడంతో దేశంలో పసిడి డిమాండ్ మళ్లీ మెరుగుపడుతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) మార్కెట్ అధ్యయనంలో వెల్లడించింది. రాబోయే పండుగ సీజన్‌లో బంగారం కొనుగోళ్లు జోరందుకుంటాయన్న అంచనాలు నెలకొన్నాయని పేర్కొంది. అయితే, తాజాగా పుత్తడి ధరలకు మళ్లీ రెక్కలు రావడం... నగల కొనుగోళ్లను ప్రభావితం చేయొచ్చని అభిప్రాయపడింది.
డబ్ల్యూజీసీ మార్కెట్ అప్‌డేట్‌లో ముఖ్యాంశాలు...
ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులను వినియోగదారులు కొనుగోలు అవకాశంగా పరిగణిస్తున్నారు. జ్యువెలరీ డిమాండ్ పుంజుకుంటోంది.
జూన్ తర్వాత ధరలు భారీగా తగ్గడం, జూలైలో స్థిరంగా ఉండటం, ఆగస్టులో మళ్లీ రికవరీ నేపథ్యంలో జ్యవెలరీ రిటైలర్లు రాబోయే పండుగ సీజన్ కోసం భారీగా నిల్వలను తిరిగి నింపుకోవడానికి దోహదం చేసింది.
గత కొన్ని నెలలుగా వాయిదా వేస్తున్న కొనుగోలుదారులు మళ్లీ షోరూమ్‌లకు తిరిగొస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం తప్పనిసరి కొనుగోళ్లే కాకుండా సాధారణ డిమాండ్ మార్కెట్లో నెలకొంటోంది.
తయారీదారులకు ఆర్డర్లు పెరుగుదల మొదలైంది. సీజనల్ డిమాండ్ విషయంలో జ్యువెలర్లలో నమ్మకం పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనం.
పాత బంగారం ఎక్స్ఛేంజ్ కూడా జోరుగానే కొనసాగుతోంది. కొనుగోళ్లలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తోంది.
భౌతిక పెట్టుబడుల డిమాండ్ గత గరిష్టాలతో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. అయితే ధరల దిద్దుబాటు సమయంలో కొనుగోళ్లకు దన్నుగా నిలిచింది.
ధరల తగ్గుదల పసిడిలో వ్యూహాత్మక పెట్టబడుల కోసం చూస్తున్న ఇన్వెస్టర్లను ఆకర్షించింది. ఇటీవల రేట్లు పుంజుకోవడంతో ఆసక్తి మరింత పెరుగుతోంది.
రెండు నెలల బలహీన ధోరణి అనంతరం, జూలైలో బంగారం దిగుమతులు మళ్లీ జోరందుకున్నాయి. డిమాండ్ మెరుగుదలతో పాటు పండుగ సీజన్ కోసం తయారీదారులు, రిటైలర్లు నిల్వలు పెంచుకుంటున్నారనేదాన్ని ఇది సూచిస్తోంది. అయితే, జనవరి–మార్చిలో సగటున 11 శాతం దిగుమతుల వృద్ధితో పోలిస్తే, జూలైలో 5 శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది.
జూన్‌లో 1.97 బిలియన్ డాలర్ల విలువైన 20 టన్నుల పుత్తడి దిగుమతులు జరగ్గా.. జూలైలో రెట్టింపు స్థాయిలో 4.16 బిలియన్ డాలర్లకు (40–45 టన్నులు) ఎగబాకాయి. గోల్డ్ రీసైక్లింగ్, ప్రధానంగా పాత బంగారం మార్పిడి కొనసాగడం వల్ల కూడా సరఫరా పెరిగింది.
ఇదీ చదవండి: యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో మార్పులు


