
బంగారం దిగుమతులపై అదనపు సుంకాలు ఉండవని అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' పేర్కొన్నారు. ఇటీవల ఆయన విధించిన సుంకాల పెంపు బంగారు కడ్డీలకు వర్తిస్తుందా?, లేదా?.. అనే దానిపై గందరగోళం చెలరేగిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు.
బంగారం మీద సుంకాలు విధించడం వల్ల.. వీటి ధరలు మరింత ఎక్కువవుతాయి. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి బంగారంపై సుంకాల విషయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తరువాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
ట్రంప్ పోస్ట్ తర్వాత.. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ రేటు ఔన్సుకు 2.4 శాతం తగ్గి 3,407 డాలర్లకు చేరుకుంది. దీంతో బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 1.2 శాతం మేర తగ్గి 3,357 డాలర్ల వద్ద నిలిచింది. గోల్డ్ మైనింగ్ కంపెనీల షేర్స్ కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.
BREAKING: President Trump just declared that gold will not be tariffed!
HUGE! pic.twitter.com/0JdVT9cXIs— Gunther Eagleman™ (@GuntherEagleman) August 11, 2025
భారతదేశంలో బంగారం ధరలు
బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం గోల్డ్ రేటు తగ్గుముఖం పడుతోంది. ఈ రోజు కూడా పసిడి ధరలు గరిష్టంగా రూ. 880 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 101400 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ. 800 తగ్గి.. రూ. 92950 (10 గ్రామ్స్) వద్ద నిలిచింది.
ఇదీ చదవండి: కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం: అమల్లోకి ఎప్పుడంటే?