
ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు 2025కు తాజాగా ఆమోదం లభించింది. బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సుల ఆధారంగా ఇందులో మార్పులు చేశారు.
సుమారు నాలుగు నెలల పాటు తీవ్రంగా సమీక్షించిన తర్వాత, కమిటీ 285 కంటే ఎక్కువ సిఫార్సులతో 4,500 పేజీలకు పైగా నివేదికను రూపొందించింది. ఈ సూచనల ఉద్దేశ్యం చట్టం భాషను సరళీకృతం చేయడం, నిబంధనలలో స్పష్టత తీసుకురావడం & పన్ను చెల్లింపుదారులకు సమ్మతిని సులభతరం చేయడం. ఇప్పుడు ప్రభుత్వం ఈ మార్పులను కలుపుకొని కొత్త ముసాయిదాను సమర్పించింది.
ప్రస్తుతమున్న 1961 చట్టాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు, రాష్ట్రపతి ఆమోదం కోరే ముందు రాజ్యసభకు వెళుతుంది. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత, కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది.
పాత vs కొత్త బిల్లు మధ్య తేడాలు
- పాత ఆదాయపు పన్ను చట్టం, 1961.. దశాబ్దాలుగా అమలులో ఉంది. అయితే అందులోని భాష, నిర్మాణం వంటివన్నీ సామాన్యులకు కొంత గందరగోళంగా ఉన్నాయి. దీనిని పూర్తిగా మార్చాలనే ఉద్దేశ్యంతో కొత్త బిల్లును తీసుకువచ్చారు.
- ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త బిల్లులో.. అధ్యాయాల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీనివల్ల చదవడం, అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.
- ఇకపై మునుపటి సంవత్సరం & అసెస్‌మెంట్ సంవత్సరం వంటి పదాలకు బదులు "పన్ను సంవత్సరం" అనే పదం వాడుకలోకి వస్తుంది.
- 2025 కొత్త పన్ను బిల్లులో ఇంతకు ముందు ఉన్న శ్లాబులు, రేట్లు అలాగే ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, ఆదాయపన్ను శ్లాబులలో కూడా ఎలాంటి మార్పు లేదు.
- కొత్త బిల్లులో, సంక్లిష్టమైన చట్టపరమైన భాషకు బదులుగా, పన్నును సులభంగా లెక్కించగల సూత్రాలు, పట్టికలను ఇవ్వడం జరిగింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎంత పన్ను చెల్లించాలో.. ఎలా చెల్లించాలో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.
ఇదీ చదవండి: ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు: స్పందించిన ఆర్‌బీఐ గవర్నర్