చల్లారుతున్న చమురు ధరల మంటలు | Crude Oil Prices Crash Pre-War Levels Petrol Diesel Prices India | Sakshi
Sakshi News home page

చల్లారుతున్న చమురు ధరల మంటలు

Jun 26 2026 10:26 AM | Updated on Jun 26 2026 1:54 PM

Crude Oil Prices Crash Pre-War Levels Petrol Diesel Prices India

యుద్ధం పూర్వ స్థాయికి ముడిచమురు ధరలు

అయినా తగ్గని పెట్రోల్, డీజిల్‌ రేట్లు

న్యూఢిల్లీ: హార్మూజ్‌ జలసంధి నుంచి నౌకల రాకపోకలకు మార్గం సుగమమై, సరఫరా మెరుగుపడుతుండటంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరులో అమెరికా, ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం మొదలు కావడానికి ముందు స్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కి 72–73 డాలర్లకు, అమెరికా క్రూడాయిల్‌ రేటు 70 డాలర్లకు దిగి వచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇవి ఒక దశలో 120 డాలర్లకు ఎగిసిన సంగతి తెలిసిందే.

ఇక ఇరాన్‌ మీద అమెరికా, ఇజ్రాయెల్‌ దాడి చేయడానికి ముందు రోజున .. అంటే ఫిబ్రవరి 27న భారత్‌ కొనుగోలు చేసే ముడిచమురు బాస్కెట్‌ ధర 71.17 డాలర్లు పలికింది. తాజాగా కేంద్ర చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్, అనాలిసిస్‌ సెల్‌ (పీపీఏసీ) డేటా ప్రకారం జూన్‌ 24న ఇది 70.71 డాలర్లకు నెమ్మదించింది. జూన్‌ పూర్తి నెలకు గాను సగటు ధర 86.31 డాలర్లుగా ఉంది. ఫిబ్రవరిలో ఇది 72.47గా నమోదైంది.  

భారత్‌కి ఊరట... 
ముడిచమురు కోసం భారత్‌ ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. సుమారు 88 శాతం క్రూడాయిల్‌ని దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో బ్యారెల్‌ ధర కనీసం 10 డాలర్లు తగ్గినా ఏటా బిలియన్ల కొద్దీ డాలర్ల స్థాయిలో దిగుమతుల బిల్లు ఆదా అవుతుంది. కరెంటు అకౌంటు లోటు తగ్గుతుంది. అలాగే, ఇంధన, రవాణా, తయారీ వ్యయాలు తగ్గడం ద్వారా రిటైల్‌ ద్రవ్యోల్బణం నెమ్మదిస్తుంది. ప్రభుత్వంపై ఇంధన సబ్సిడీల భారం కూడా తగ్గి .. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ఇంధనాల రేట్లు తగ్గడం వల్ల పెట్రోకెమికల్‌ డెరివేటివ్స్‌ కీలకంగా ఉండే ఏవియేషన్, పెయింట్స్, కెమికల్స్, లాజిస్టిక్స్, కన్జూమర్‌ గూడ్స్‌ తదితర రంగాలకు కూడా ఊరట లభిస్తుంది. దీన్ని ప్రతిబింబిస్తూ, ఇంధనాలను విరివిగా ఉపయోగించే కంపెనీల మార్జిన్లు బాగుంటాయనే ఇన్వెస్టర్ల అంచనాలతో వాటి  షేర్లు ఇప్పటికే పుంజుకోవడం కనిపిస్తోంది. ఇక, ఇంధనాల దిగుమతులకు డాలర్లను చెల్లించడం తగ్గుతుంది కాబట్టి, వాటికి డిమాండ్‌ నెమ్మదించి రూపాయి మారకం 
విలువ పెరుగుతుంది.  

తగ్గుదల స్థిరంగా ఉంటేనే..  
గ్లోబల్‌గా క్రూడాయిల్‌ ధరలు ఎగియడంతో ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్‌ సంస్థలు పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటరుకు సుమారు రూ. 7.50 మేర పెంచిన సంగతి తెలిసిందే. అయితే, ముడి చమురు ధరలు రికార్డు స్థాయుల నుంచి తగ్గినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ రేట్లను మాత్రం అవి తగ్గించలేదు. దీనితో ధర ధరలను రోజువారీగా కాకుండా అంతర్జాతీయంగా గడిచిన పక్షం, నెల రోజుల సగటు రేట్లను బట్టి ఆయిల్‌ కంపెనీలు సవరిస్తాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఒకవేళ క్రూడాయిల్‌ రేట్లు నిలకడగా తక్కువ స్థాయిలోనే కొనసాగిన పక్షంలో పెట్రోల్‌ బంకుల్లో ఆ ప్రయోజనాలు కనిపించాలంటే కొంత సమయం పట్టొచ్చని వివరించాయి. గ్లోబల్‌గా క్రూడాయిల్‌ రేట్లు భారీగా పెరిగినప్పటికీ దాదాపు రెండున్నర నెలల తర్వాతే ఆయిల్‌ కంపెనీలు ఇంధనాల రేట్లను పాక్షికంగా పెంచినట్లు పేర్కొన్నాయి.

ప్రస్తుతం ముడిచమురు ధరలు తగ్గిన తరుణంలో డీజిల్‌ విక్రయాలపై స్వల్ప నష్టాలు వస్తున్నప్పటికీ పెట్రోల్‌పై మెరుగ్గా మార్జిన్లు లభిస్తున్నాయని అధికారులు వివరించారు. ఆయిల్‌పై ఆందోళన తగ్గడమనేది ప్రభుత్వ స్పందనలోనూ కనిపిస్తోంది. ఉద్రిక్తతలు మొదలైన తర్వాత నుంచి అంతర్‌ మంత్రిత్వ శాఖలకు ప్రతి రోజూ తాజా పరిస్థితుల గురించి బ్రీఫింగ్‌ జరిగేది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై కీలక మంత్రిత్వ శాఖల అధికారులు ఇందులో చర్చించేవారు. పరిస్థితి మెరుగుపడే కొద్దీ ఈ సమావేశాల నిర్వహణ నెమ్మదిగా వారానికి రెండు సార్లకు తగ్గింది. సాధారణంగా సోమవారం, గురువారం బ్రీఫింగ్‌ నిర్వహిస్తున్నప్పటికీ, ఈ వారం అసలు సమావేశాలే జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement