
ముంబై: కస్టమర్ల కేవైసీ వివరాల నవీకరణతోపాటు.. చురుగ్గాలేని ఖాతాలను వినియోగంలోకి తీసుకువచ్చే విషయంలో బిజినెస్ కరస్పాండెంట్ల సాయం బ్యాంక్‌లు తీసుకునే వెలుసుబాటు లభించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనతో ఆర్‌బీఐ ఒక ముసాయిదా సర్క్యులర్ విడుదల చేసింది.
కాలానుగుణంగా చేయాల్సిన కేవైసీ అప్‌డేషన్ విషయమై పెద్ద ఎత్తున పని అపరిష్కృతంగా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చింది. ఇందులో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), ఎల్రక్టానిక్ రూపంలో ప్రయోజనం బదిలీ (ఈబీటీ) కోసం తెరిచిన ఖాతాలు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద తెరిచిన ఖాతాల విషయంలోనూ కస్టమర్లు సమస్యలను ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. కేవైసీ అప్‌డేషన్ విషయంలో సమస్యలపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్టు పేర్కొంది. కస్టమర్ల సౌకర్యం దృష్ట్యా కేవైసీ అప్‌డేషన్ విషయంలో బిజినెస్ కరస్పాడెంట్లను అనుమతించేందుకు సవరణలు చేసినట్టు తెలిపింది. దీనిపై జూన్ 6లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆర్‌బీఐ కోరింది.