పేద కూలీలపై చంద్రబాబు కక్ష.. ఉపాధికి ఎసరు! | Chandrababu govt Fraud to Employment of poor people | Sakshi
Sakshi News home page

పేద కూలీలపై చంద్రబాబు కక్ష.. ఉపాధికి ఎసరు!

Dec 9 2025 9:08 AM | Updated on Dec 9 2025 9:13 AM

Chandrababu govt Fraud to Employment of poor people

పేద కూలీలపై కక్ష సాధిస్తున్న చంద్రబాబు సర్కారు 

జిల్లా వ్యాప్తంగా 11 వేల జాబ్‌ కార్డుల తొలగింపు 

ఫొటో క్యాప్చర్‌తో ఆందోళనలో కూలీలు 

శుక్లం, కంటి ఆపరేషన్‌ చేయించుకున్న వారికి ఈకేవైసీ కాని వైనం

కడప సిటీ: చంద్రబాబు సర్కారు రోజుకో రూల్‌తో ఉపాధి కూలీలను ఇబ్బంది పెడుతోంది. మొన్న కుంటి సాకులు చెబుతూ నిర్దాక్షిణంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించింది. నిన్నేమో ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరులంటూ ఏకంగా జాబ్‌ కార్డుల్నే తీసేసింది. తాజాగా  ఫొటో క్యాప్చర్‌ అంటూ కూలీల్లో గుబులు పుట్టిస్తోంది. నిజానికి ఉపాధి హామీ పథకానికి  కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను అందిస్తుంది. కేవలం పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అయినా బాబు సర్కారు పెత్తనం చెలాయిస్తోంది. రోజుకో కొర్రీలు పెడుతూ పేద కూలీల మీద కక్షసాధింపు చర్యలకు దిగుతోంది.  

వారికి నిరాశే.. 
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు సంబంధించి అక్రమాలు జరగకూడదనే ఉద్దేశ్యంతో ఈకేవైసీ చేస్తోంది. అంటే ప్రతి  ఉపాధి హామీ కూలీని ఫొటో క్యాప్చర్‌ (ఫేస్‌ రీడింగ్‌) చేస్తోంది. ఈ వి«ధానం వల్ల ఒకరికి బదులు మరొకరు పనికి వెళ్లేందుకు వీలుండదు. ఉద్దేశం మంచిదే అయినా ఈ ఫోటో క్యాప్చర్‌ విధానం వల్ల  కొంతమందికి ఫేస్‌ రీడింగ్‌ కావడం లేదు. ప్రధానంగా కంట్లో శుక్లం ఉన్నవారికి, ఆపరేషన్‌ చేయించుకున్న వారికి, ఆధార్‌ అప్‌డేట్‌ చేయని వారికి ప్రధాన సమస్యగా మారింది. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆప్షన్‌ లేదు 
ఫోటో క్యాప్చర్‌ కాని వారు ప్రస్తుతానికి పనులు వెళుతున్నారుగానీ, భవిష్యత్తులో జాబ్‌కార్డు ఉంటుందా? లేదా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. వీరికి మాత్రం ఆప్షన్‌ ఇవ్వకుండా ఉండడంతో మరింత భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఏదో ఒక ఆప్షన్‌ ఇచ్చి వీరిని కూడా ఈకేవైసీ చేయిస్తే వారి ఆందోళన తగ్గే అవకాశం ఉంది.

11 వేల జాబ్‌కార్డుల తొలగింపు
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో 308387 మంది యాక్టివ్‌ కూలీలుగా ఉన్నారు. ఇందులో ఈకేవైసీ పూర్తయిన వారు 2,53,792 మంది ఉన్నారు. దీంతో 82.31 శాతం ఈకేవైసీ అయింది. అక్టోబరు 7 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే ఏప్రిల్‌ 26లోపు ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. 

ఇదిలా ఉండగా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తుల జాబ్‌కార్డులు కావాలని తొలగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఇంతవరకు జిల్లాలో 11 వేల జాబ్‌కార్డులు తొలగించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకంపై కూడా తమ ప్రతాపాన్ని చూపుతూ పేద కూలీలపై తన కక్షసాధింపు ధోరణిని కొనసాగిస్తోంది.    
ఫొటో క్యాప్చర్‌ చేస్తున్న ఉపాధి సిబ్బంది  

82.31 శాతం ఈకేవైసీ 
జిల్లాలో ఇప్పటివరకు 82.31 శాతం ఈకేవైసీ పూర్తయింది. అక్టోబరు 7 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. జిల్లాలో కొంతమంది జాబ్‌కార్డులను తొలగించిన విషయం వాస్తవమే. వివాహమై ఊరు విడిచి వెళ్లిన వారివి మాత్రమే తొలగించాం..అంతేగానీ మిగతా వారిని తొలగించలేదు.     
– ఆదిశేషారెడ్డి, పీడీ, డ్వామా, కడప  

ఫేస్‌ రీడింగ్‌ కారణంగా ఇబ్బందులు 
ఉపాధి పనులకు సంబంధించి ఫేస్‌ రీడింగ్‌ విధానం అమలు చేస్తున్న కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. సాంకేతిక సమస్యల కారణంగా ఫేస్‌ రీడింగ్‌ కాకపోతే పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కంటి సమస్యలున్న వారికి సమస్య మరింత అధికంగా ఉంది. ఈ విషయంగా ప్రభుత్వం పునరాలోచన చేయాలి.     – వెంకట సుబ్బయ్య,లింగారెడ్డిపల్లె, సీకే దిన్నె  

జాబ్‌ కార్డుల తొలగింపు సరికాదు 
సరైన కారణాలు లేకుండా కూలీల జాబ్‌కార్డులను తొలగిస్తున్నారు. రోజువారి కూలీ సంపాదనతో జీవించే వారికి రాజకీయాలు అంటూ తెలియవు. కొన్ని ప్రాంతాల్లో కక్షసాధింపు ధోరణి కొనసాగుతోంది. జాబ్‌ కార్డులు ఇలా ఏకపక్షంగా కొనసాగితే పనుల కోసం వలసలు తప్పవు. పేదల ఇబ్బందులు గుర్తించి  ఉపాధి పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి.     
    –బాబయ్య, కొలుములపల్లె, సీకే దిన్నె మండలం   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement