గుడ్‌న్యూస్‌! కెనడాలో వర్క్‌ పర్మిట్‌.. కీలక మార్పులు

Canada changed rules of post graduation work permit for international students - Sakshi

Canada work permit : కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు శుభవార్త ఇది. పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (PGWP) కి కెనడా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రెండేళ్లలోపు వ్యవధి ఉన్న మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఇప్పుడు 3 సంవత్సరాల పీజీడబ్ల్యూపీకి అర్హత పొందుతారు. 2024 ఫిబ్రవరి 15 నుంచి ఈ మార్పులను ఆ దేశ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. 

అయితే 2024 సెప్టెంబరు 1 నుండి కరికులమ్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న విద్యార్థులు ఇకపై పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్‌కి అర్హత పొందలేరు. అలాగే దూరవిద్య, పీజీడబ్ల్యూపీ చెల్లుబాటు కోసం ప్రత్యేక చర్యలను 2024 ఆగస్టు 31 వరకు పొడిగించింది.

పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అనేది కెనడాలో చదువులు పూర్తయిన తర్వాత విదేశీ విద్యార్థులకు మంజూరు చేసే ఓపెన్ వర్క్ పర్మిట్. పీజీడబ్ల్యూపీ హోల్డర్‌లు కెనడాలో ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా తమకు నచ్చినన్ని గంటలు పని చేసుకోవచ్చు. పీజీడబ్ల్యూపీ చెల్లుబాటు ఎంత కాలం ఉంటుందనేది స్టడీ ప్రోగ్రామ్ స్థాయి, వ్యవధితోపాటు పాస్‌పోర్ట్ గడువు తేదీపై ఆధారపడి ఉంటుంది.

విదేశీ విద్యార్థులందరూ అర్హులేనా? 
కెనడాలోని ఆమోదిత విద్యా సంస్థలలో కనీసం రెండు సంవత్సరాల నిడివి ఉన్న డిగ్రీ ప్రోగ్రామ్‌లు పూర్తి చేసి తాత్కాలికంగా కొన్నాళ్లపాటు కెనడాలో ఉండాలనుకుంటున్న విదేశీ విద్యార్థులందరూ 3 సంవత్సరాల పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (PGWP)కి అర్హులు. ఇక మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల విషయానికి వస్తే కనీసం 8 నెలలు (లేదా 900 గంటల క్యూబెక్ క్రెడెన్షియల్స్‌ ) వ్యవధి ఉండాలి. అన్ని ఇతర అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నంత వరకు మాస్టర్స్ డిగ్రీ వ్యవధి 2 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ 3 సంవత్సరాల పీజీడబ్ల్యూపీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది సర్టిఫికేట్ లేదా డిప్లొమా ప్రోగ్రామ్‌లకు వర్తించదు.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top