ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. తీవ్రతరం అవుతున్న వాయు కాలుష్య స్థాయిలను అరికట్టడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) దశ IIIని అమలు చేయాలని కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఆదేశాలు జారీ చేసింది.
కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఆదేశాల ప్రకారం.. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్‌లలో అన్ని BS-III పెట్రోల్ మరియు BS-IV డీజిల్ వాహనాలను డ్రైవ్ చేయకూడదు. ఢిల్లీ - ఎన్‌సీఆర్‌లో AQI లెవెల్ 400 మార్కును దాటడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 20వేలు వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
2020 ఏప్రిల్ నెలకు ముందు అమ్ముడైన అన్ని కార్లు BS-IV కేటగిరీలోకి వస్తాయి. కాగా BS-III నిబంధనలు 2010 ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో బీఎస్6 వాహనాలు వినియోగంలో ఉన్నాయి. ఈ వాహనాలతో పోలిస్తే.. బీఎస్4, బీఎస్3 వాహనాలు అధిక కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. ఈ కారణంగానే ఢిల్లీలో ఈ వాహనాల వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించారు.


