భీమ్ యాప్ కొత్త రికార్డు..ఏడాదిలో మూడు రెట్లు! | BHIM App Sees 3X Growth in Transactions Over the Past Year | Sakshi
Sakshi News home page

భీమ్ యాప్ కొత్త రికార్డు..ఏడాదిలో మూడు రెట్లు!

Jun 25 2026 3:56 PM | Updated on Jun 25 2026 4:04 PM

BHIM App Sees 3X Growth in Transactions Over the Past Year

ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్‌బీఎస్ఎల్) రూపొందించిన 'భీమ్ (BHIM) పేమెంట్స్ యాప్', గత 12 నెలల్లో పటిష్టమైన వృద్ధిని నమోదు చేసింది. 2025 జూన్, 2026 మే నెల మధ్య కాలంలో ఈ యాప్ ద్వారా లావాదేవీల పరిమాణం మూడు రెట్లకు పైగా పెరిగింది. ఈ యాప్‌లో నెలవారీ లావాదేవీల సంఖ్య 2025 జూన్‌లో 7.964 కోట్లుగా ఉండగా, 2026 మే నెల నాటికి అది ఏకంగా 24.4 కోట్లకు చేరుకుంది.

ఒక్క 2026 మే నెలలోనే ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ. 26,952 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. దేశవ్యాప్తంగా రోజువారీ అవసరాల కోసం డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రజలు గణనీయంగా వినియోగిస్తున్నారనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.

జాతీయ ధోరణికి అనుగుణంగానే తెలంగాణలో కూడా భీమ్ యాప్ వృద్ధి నమోదైంది. ఇక్కడ సైతం 2025 జూన్ నుంచి 2026 మే మధ్య లావాదేవీల పరిమాణం మూడు రెట్లు పెరిగింది. 2026 మే నెలలో ఈ యాప్ ద్వారా రాష్ట్రంలో జరిగిన మొత్తం మర్చంట్ లావాదేవీలలో నిత్యావసరాలు 23.9% శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా, ఫుడ్ అవుట్‌లెట్స్ (18.1%), క్విక్ కామర్స్ (11.6%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఇవే కాకుండా డెయిరీ అండ్ బేకరీలు (3.2%), పెట్రోల్ బంకులు (2.8%), ఈ-కామర్స్ (2.2%), ప్రభుత్వ సేవలు (2.0%) ఇతర ముఖ్యమైన కేటగిరీలుగా ఉన్నాయి. ఇది రోజువారీ ఖర్చులలో డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. వీటితో పాటు యూపీఐ లైట్, యూపీఐ ఆధారిత రూపే క్రెడిట్ కార్డ్  వంటి సరికొత్త పేమెంట్ విధానాలను కూడా రాష్ట్ర ప్రజలు విస్తృతంగా వాడుతున్నారు.

యాప్‌లోని ముఖ్యమైన ఫీచర్లు
యూపీఐ సర్కిల్: ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నమ్మకమైన వ్యక్తులకు నెలకు గరిష్టంగా రూ. 15,000 పరిమితితో, 5 సంవత్సరాల కాలవ్యవధి వరకు తమ ఖాతా నుంచి పేమెంట్స్ చేసుకునే అధికారాన్ని ఇవ్వవచ్చు. దీనికోసం అవతలి వారికి ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా లేదా యూపీఐ ఐడీ ఉండాల్సిన అవసరం లేదు. దీనివల్ల కుటుంబ సభ్యులు, సిబ్బంది రోజువారీ ఖర్చులను, అన్ని లావాదేవీలను పర్యవేక్షించడం సులువవుతుంది.

స్ప్లిట్ ఎక్స్‌పెన్సెస్: స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి హోటల్‌కు వెళ్లినప్పుడు, రూమ్ అద్దెలు కట్టినప్పుడు లేదా గ్రూప్ కొనుగోళ్లు చేసినప్పుడు ఆ బిల్లును అందరూ సమానంగా పంచుకుని, నేరుగా యాప్ ద్వారానే ఎవరి వాటా వారు సులభంగా చెల్లించవచ్చు.

ఫ్యామిలీ మోడ్: కుటుంబ సభ్యులందరినీ ఒకే చోట చేర్చి, ఉమ్మడి ఖర్చులను ట్రాక్ చేయడానికి మరియు నిర్దిష్ట బిల్లుల చెల్లింపులను కేటాయించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనితో తమ ఖర్చులు ఒకే చోట కనిపించడం వల్ల కుటుంబ ఆర్థిక ప్రణాళిక సులువవుతుంది.

స్పెండ్స్ అనలిటిక్స్: ఈ డ్యాష్‌బోర్డ్ యూజర్ యొక్క నెలవారీ ఖర్చుల విధానాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఖర్చులను ఆటోమేటిక్‌గా కేటగిరీల వారీగా విభజించి చూపడం ద్వారా, ఎలాంటి క్లిష్టమైన లెక్కలు లేకుండానే బడ్జెట్‌ను మేనేజ్ చేసుకోవచ్చు.
యూపీఐ లైట్ ఆటో-టాప్ అప్: యూపీఐ లైట్ వాలెట్‌లోని బ్యాలెన్స్ రూ. 200 కంటే తగ్గినప్పుడు, ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా వాలెట్‌ను రీఛార్జ్ చేస్తుంది.

యూపీఐ బేస్డ్ రూపే క్రెడిట్ కార్డ్: యూజర్లు తమ రూపే క్రెడిట్ కార్డ్‌ను యూపీఐకి లింక్ చేయడం ద్వారా క్రెడిట్ ఆధారిత లావాదేవీలను సులభంగా జరుపుకోవచ్చు.

ఫారెక్స్ పేమెంట్స్: విదేశీ కరెన్సీ (ఫారెక్స్) అవసరమైన వారు భీమ్ యాప్ ద్వారానే నేరుగా బుక్ చేసుకోవచ్చు. వివిధ బ్యాంకుల ధరలను పోల్చి చూసి నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ కరెన్సీని నగదు రూపంలో లేదా డిజిటల్ కరెన్సీ రూపంలో పొందే వీలుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement