
భారత టెలికాం రంగంలో కాంట్రాక్టు ఉద్యోగుల సగటు నెలవారీ వేతనం పెరిగింది. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ .24,609 లుగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి సగటు జీతం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ .25,225 కు చేరినట్లు టీమ్ లీజ్ సర్వీసెస్ తాజా డేటా సూచిస్తోంది.
నివేదిక ప్రకారం.. భారత టెలికాం పరిశ్రమ 2025లో ఒప్పంద శ్రామిక శక్తి విస్తరణలో మందగమనాన్ని చవిచూసింది. అదే సమయంలో తమ కార్యాచరణ అవసరాల కోసం యువ ప్రతిభావంతులపై పెట్టుబడులనూ కొనసాగిస్తోంది.
నివేదికలోని మరన్ని వివరాలు
🔹కాంట్రాక్టు ఉద్యోగుల్లో 18 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు.
🔹2024-25 ఆర్థిక సంవత్సరంలో అసోసియేట్ స్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగాల వృద్ధి 11.9 శాతానికి తగ్గింది.
🔹అట్రిషన్ స్థాయిలు కాలక్రమేణా సాపేక్షంగా స్థిరంగా ఉన్నాయి. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 50.8 శాతం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50.3 శాతంగా నమోదైంది.
🔹కాంట్రాక్ట్ అసోసియేట్లలో ఎక్కువ మంది తమ కెరీర్ ప్రారంభ దశలో ఉన్నవారే. 60 శాతం మందికి రెండు సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉంది.
‘ఈ డేటా టెలికాం రంగ శ్రామిక శక్తి వ్యూహంలో స్థిరమైన పునఃసమీక్షను ప్రతిబింబిస్తుంది. నియామకాలు మరింత ఆచితూచి చేస్తున్నప్పటికీ, డైనమిక్, కస్టమర్-ఫేసింగ్, టెక్నికల్ ఉద్యోగాలకు తగిన యువ, విద్యావంతులైన అభ్యర్థులను తీసుకోవడంపై బలమైన దృష్టి కొనసాగుతోంది" అని టీమ్‌లీజ్ సర్వీసెస్ స్టాఫింగ్ సీఈవో కార్తీక్ నారాయణ్ అన్నారు.