breaking news
contractual employees
-
కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెరిగాయ్...
భారత టెలికాం రంగంలో కాంట్రాక్టు ఉద్యోగుల సగటు నెలవారీ వేతనం పెరిగింది. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ .24,609 లుగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి సగటు జీతం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ .25,225 కు చేరినట్లు టీమ్ లీజ్ సర్వీసెస్ తాజా డేటా సూచిస్తోంది.నివేదిక ప్రకారం.. భారత టెలికాం పరిశ్రమ 2025లో ఒప్పంద శ్రామిక శక్తి విస్తరణలో మందగమనాన్ని చవిచూసింది. అదే సమయంలో తమ కార్యాచరణ అవసరాల కోసం యువ ప్రతిభావంతులపై పెట్టుబడులనూ కొనసాగిస్తోంది.నివేదికలోని మరన్ని వివరాలు🔹కాంట్రాక్టు ఉద్యోగుల్లో 18 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు. 🔹2024-25 ఆర్థిక సంవత్సరంలో అసోసియేట్ స్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగాల వృద్ధి 11.9 శాతానికి తగ్గింది.🔹అట్రిషన్ స్థాయిలు కాలక్రమేణా సాపేక్షంగా స్థిరంగా ఉన్నాయి. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 50.8 శాతం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50.3 శాతంగా నమోదైంది. 🔹కాంట్రాక్ట్ అసోసియేట్లలో ఎక్కువ మంది తమ కెరీర్ ప్రారంభ దశలో ఉన్నవారే. 60 శాతం మందికి రెండు సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉంది.‘ఈ డేటా టెలికాం రంగ శ్రామిక శక్తి వ్యూహంలో స్థిరమైన పునఃసమీక్షను ప్రతిబింబిస్తుంది. నియామకాలు మరింత ఆచితూచి చేస్తున్నప్పటికీ, డైనమిక్, కస్టమర్-ఫేసింగ్, టెక్నికల్ ఉద్యోగాలకు తగిన యువ, విద్యావంతులైన అభ్యర్థులను తీసుకోవడంపై బలమైన దృష్టి కొనసాగుతోంది" అని టీమ్‌లీజ్ సర్వీసెస్ స్టాఫింగ్ సీఈవో కార్తీక్ నారాయణ్ అన్నారు. -
బదిలీ అధికారం యజమానికి ఉంది
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీ విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారిని బదిలీచేసే అధికారం సదరు యజమాని (ప్రభుత్వం)కి ఉందని స్పష్టంచేసింది. ఒప్పందంలో బదిలీ ప్రస్తావన ఉన్నప్పుడు ప్రభుత్వం వారిని బదిలీ చేయడం తప్పుకాదని తేల్చిచెప్పింది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను బదిలీచేస్తూ 2022లో ప్రభుత్వం జారీచేసిన జీఓ–103ను హైకోర్టు సమర్ధించింది. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగులు కనీస వేతన స్కేల్‌కు అర్హులని స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని వారందరికీ కనీస వేతన స్కేల్‌ను వర్తింపజేస్తూ సమగ్ర ఉత్తర్వులు జారీచేసిందని.. అందులో కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నారని పేర్కొంది. సవరించిన కనీస వేతన స్కేల్‌ను కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 1–1–2022 నుంచి అమలుచేయాలని.. వారికి చెల్లించాల్సిన బకాయిలను 12 వారాల్లో చెల్లించాలని అధికారులకు తేలి్చచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ కృపాసాగర్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు.. రాష్ట్ర ప్రభుత్వం తమకు కనీస వేతన స్కేల్‌ను ఖరారుచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను అమలుచేసేలా అధికారులను ఆదేశించడంతో పాటు, తమను వివిధ ప్రాంతాలకు బదిలీచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను చట్ట విరుద్దంగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లోని కాంట్రాక్టు టీచర్లు 2022లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు కాంట్రాక్టు టీచర్ల బదిలీల ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించారు. ఇదే సమయంలో కోర్టుకొచ్చిన టీచర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగించాలని.. అంతేకాక.. వారికి కనీస వేతనాలు, తదనుగుణ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పారు. బదిలీల విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ కాంట్రాక్టు టీచర్లు.. కనీస వేతనాలపై ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. బదిలీ అధికారం యజమానికి ఉంది ‘ఇక కాంట్రాక్టు టీచర్ల బదిలీ విషయానికొస్తే, వారిని కావాల్సిన చోటుకు బదిలీ చేయడం సబబే. నిజానికి.. 2013 నాటి కాంట్రాక్టు ఒప్పందంలో బదిలీల విషయంలో ఎలాంటి నిబంధన లేదు. దీని ఆధారంగా కాంట్రాక్టు టీచర్లు తమను బదిలీ చేయడానికి వీల్లేదంటున్నారు. అయితే, 2022లో తీసుకొచ్చిన కొత్త ఒప్పందంలో బదిలీ నిబంధన ఉంది. అందువల్ల ప్రస్తుత కేసులో కాంట్రాక్టు టీచర్ల బదిలీ ఉత్తర్వులను ఎంతమాత్రం తప్పుపట్టలేం. బదిలీల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు సమర్థనీయమే’.. అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంచేసింది. వారికిచ్చి వీరికివ్వకపోవడం వివక్షే.. వీటిపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కాంట్రాక్టు టీచర్ల తరఫు న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పు కాంట్రాక్టు, తాత్కాలిక, అడ్హాక్ తదితర ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాలను వర్తింపజేస్తూ జీఓ ఇచ్చిందని, అయితే అధికారులు వాటిని కాంట్రాక్టు టీచర్లకు వర్తింపచేయడం లేదన్నారు. పిటిషనర్లు కాంట్రాక్టు టీచర్లు మాత్రమేనని, వారికి ట్రాన్స్ఫర్లు వర్తింపజేయడానికి వీల్లేదని తెలిపారు. కనీస వేతనాలు వర్తింపజేయకుండా బదిలీలు చేయడానికి వీల్లేదన్నారు. సర్వశిక్షాభియాన్ తరఫు న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపిస్తూ.. కేజీబీవీ, యూనివర్సిటీలు, సొసైటీలు, మోడల్ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కనీస వేతన స్కేల్‌ను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అయితే, ఈ ఉత్తర్వులు మంజూరు చేసిన ఖాళీల కింద నియమితులైన వారికి మాత్రమే వర్తిస్తాయన్నారు. అలాగే, బదిలీ చేయాలని పలువురు కాంట్రాక్టు టీచర్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమరి్పంచారని, ఆ మేరకు వారి బదిలీ జరిగిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కనీస వేతనాల విషయంలో ఎన్వీ సుమంత్ వాదనలతో ఏకీభవిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. అంతేకాక.. ‘తమకు కనీస వేతన స్కేల్ ఉత్తర్వులను వర్తింపజేయాలన్న కాంట్రాక్టు టీచర్ల అభ్యర్థన సబబైనదే. సమాన పనికి సమాన వేతనం చెల్లించకపోవడం అన్నది దోపిడీ, బానిసత్వం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకునే వారికి కనీస వేతన స్కేల్‌ను అమలుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అధికారులు ఆ స్కేల్‌ను వర్తింపజేయకపోవడం ఏకపక్షం. కనీస వేతనాల విషయంలో సింగిల్ జడ్జి తీర్పును ఏ రకంగానూ విమర్శించాల్సిన అవసరంలేదు’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించింది. 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని వెల్లడించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కలిగిన ఉద్యోగ సంఘాల నాయకులతో సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉద్యోగులకు అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు. పీఆర్సీ, డీఏ బకాయిలు రెండింటినీ కలిపి ఒకటిగా చేసి చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయని, ప్రభుత్వం అందుకు అంగీకరించినట్లు చెప్పారు. మూడు నెలలకు ఒక విడత చొప్పున, సంవత్సరానికి నాలుగు విడతలు, నాలుగేళ్లలో 16 విడతల్లో ఈ బకాయిలను ఉద్యోగులకు ఇస్తామని వివరించారు. మొదటి సంవత్సరం పది శాతం, రెండో సంవత్సరం 20 శాతం, మూడో సంవత్సరం 30 శాతం, నాలుగో సంవత్సరం 40 శాతం చొప్పున ఇస్తామన్నారు. ఏటా పది శాతం చొప్పున పెంచుకుంటూ నాలుగు సంవత్సరాల్లో మొత్తం బకాయిలను ఇస్తామన్నారు. దీనికి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయన్నారు. సీపీఎస్ కంటే మెరుగ్గా ఉద్యోగులకు సీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలు చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ఇకపై 010 పద్దు ప్రకారం జీతాలు చెల్లిస్తామన్నారు. త్వరలో కొత్త పీఆర్సీ కమిటీని నియమిస్తామని వెల్లడించారు. ఉద్యోగుల స్పెషల్ పే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ అంశాలన్నింటికీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం శాఖల వారీగా ఉత్తర్వులిస్తామన్నారు. ఆలస్యమైనా.. అనుకూలంగానే ఇది ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని, ఉద్యోగులంతా తమ సోదరులేనని మంత్రి బొత్స పేర్కొన్నారు. తమ కుటుంబాల్లోనూ ఉద్యోగులున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల వల్ల వారికి ఇవ్వాల్సిన వాటి విషయంలో కొంత ఆలస్యం జరిగిందే కానీ, ఉద్యోగుల పట్ల సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి మొదటిరోజు చెప్పిన మాటకే సీఎం కట్టుబడి ఉన్నారని, దాని ప్రకారమే వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఓపిగ్గా సంప్రదింపులు జరిపిన ఉద్యోగ సంఘాలకు బొత్స అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్యం) చిరంజీవి చౌదురి, ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ కేవీవీ సత్యనారాయణ (సర్వీసెస్, హెచ్ఆర్), కార్యదర్శి పి.భాస్కర్, ఎస్టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, పీఆర్టీయు అధ్యక్షుడు కృష్ణయ్య, యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు, ఏపీజీఈఏ కార్యదర్శి ఆస్కార్‌రావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 71 డిమాండ్లు నెరవేరాయి: బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎదుట ఉంచిన 71 డిమాండ్లలో దాదాపు అన్నీ పరిష్కారమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఐదేళ్లకోసారి పీఆర్సీ డిమాండ్‌ను పోరాడి సాధించుకున్నాం. ఆ డిమాండ్ ప్రకారం 7వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తామన్నారు. స్పెషల్ పే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొత్తగా ఏర్పడిన 8 జిల్లాలకు హెచ్ఆర్ఏను 16 శాతం పెంచడం మంచి విషయం. ఇన్నాళ్లూ వైద్య శాఖలో ఏబీవీపీని ఓ ప్రైవేట్ కంపెనీలా చూసేవారు. వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు దక్కినందుకు అభినందిస్తున్నాం. సీపీఎస్ ఉద్యోగుల విషయాన్ని కేబినెట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. అన్నీ పాజిటివ్ అంశాలే : వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన సమావేశంలో అన్ని అంశాలు ఉద్యోగులకు పాజిటివ్‌గా ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. సీఎం గతంలో చెప్పినట్లుగా పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తామన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారికి పెన్షన్ భద్రత కల్పించేలా చూస్తామన్నారు. స్పెషల్ పే ఇవ్వడానికి అంగీకరించారు. డీఏ, పీఆర్సీ బకాయిలను నాలుగేళ్లలో విడతలవారీగా ఇస్తామన్నారు. పలు సానుకూల నిర్ణయాలు: బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లను చాలా వరకు నెరవేర్చింది. ఉద్యోగులకు అనుకూలంగా చాలా సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. పీఆర్సీ, డీఏ బకాయిలు మొత్తం రూ.7 వేల కోట్లు ఉంటాయి. వాటిని నాలుగేళ్లలో విడతలవారీగా చెల్లించేందుకు అంగీకరించారు. విభజన నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సుమారు 7, 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు అంగీకరించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపైనా సానుకూలంగా స్పందించారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వచ్చే కేబినెట్లో తీర్మానం చేస్తామన్నారు. ఇది కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.మురళీరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. 2014కు ముందు ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ నిర్ణయం తీసుకోవడం వారికి శుభవార్త అంటూ ఈ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతీ ఉద్యోగి సీఎంకు అండగా నిలుస్తారన్నారు. 22 ఏళ్ల సుదీర్ఘ కల నెరవేరుతోంది.. సీఎంకు ఏపీ స్టేట్ కాంట్రాక్టు ఫార్మసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఏపీ స్టేట్ కాంట్రాక్టు ఫార్మాసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ స్వాగతించింది. 22 ఏళ్ల తమ సుదీర్ఘ కలను నెరవేరుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2001 నుంచి శాశ్వత ఉద్యోగ నియామకాలకు స్వస్తి పలికి కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకుంటూ వచ్చారని.. ఇప్పుడు 2–06–2014కు ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని ముఖ్యమంత్రి జగన్ రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.రత్నాకర్‌బాబు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
అమెజాన్ గోడౌన్ లో భారీ చోరీ
థానే: అమెజాన్ గోడౌన్ లో భారీ చోరీ జరిగింది. ఆ సంస్థలో కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే కొందరు ఉద్యోగులు వారం కిందట కొన్ని విలువైన మొబైల్స్ ను చోరీ చేశారు. థానేలోని కురుంద్ లో కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు ఆ వివరాలు వెల్లడించారు. మే 22న కొందరు ఉద్యోగులు 17 మొబైల్ హ్యాండ్ సెట్లను దొంగిలించారు. అయితే వాటి విలువ రూ.10 లక్షలకు పైమాటేనని అమెజాన్ సంస్థ వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టోరేజ్ హౌస్ లో పనిచేసే ఐదుగురు ఉద్యోగులు ఈ పని చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకూ ఎవరిని అరెస్ట్ చేయలేదని, దర్యాప్తు ప్రారంభించినట్లు స్టేషన్ ఇన్స్పెక్టర్ జైప్రకాష్ బోసాలే తెలిపారు. ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు. అయితే మే 29న మరో కాంట్రాక్ట్ ఉద్యోగి రూ.8 వేలు విలువ చేసే మొబైల్ ను స్టోరేజ్ హౌస్ నుంచి చోరీ చేస్తూ దొరికిపోయాడు. ఆ ఉద్యోగి పేరు ఆకాశ్ సపాత్ అని, ఐపీసీ సెక్షన్లు 381, 511 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు బోసాలే పేర్కొన్నారు.