
భారతదేశపు ఐటీ కంపెనీ జోహో అభివృద్ధి చెందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ 'అరట్టై'కు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ యాప్ శుక్రవారం నాటికి మొత్తం 75 లక్షల డౌన్‌లోడ్‌లను అధిగమించింది. అంటే అంతమంది దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఇది ఇటీవలి కాలంలో.. అతి తక్కువ కాలంలో ఎక్కువ డౌన్‌లోడ్స్ పొందిన యాప్‌లలో ఒకటిగా నిలిచింది.
ఇప్పటి వరకు చాలామంది భారతీయులు.. మెటా యాజమాన్యంలోని వాట్సప్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇక దేశీయ యాప్ అరట్టైను ఉపయోగించాలని పలువురు మంత్రులు, వ్యవస్థాపకులు, సీఈఓలు పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ & ఆపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.
అరట్టై అంటే.. తమిళంలో సరదాగా ముచ్చటించుకోవడం అని అర్థం. దీనిని జోహో సంస్థ.. వాట్సప్‌కు పోటీగా అభివృద్ధి చేసింది. ఇది వాట్సప్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంది. దీనికి అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి కేంద్రమంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా నేను అరట్టై డౌన్‌లోడ్ చేసుకున్నా అంటూ ట్వీట్ చేశారు.
అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలు
➤అరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.
➤అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.
➤అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్‌లు, ఇతర ఫైల్‌లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: మస్క్ ట్వీట్: నెట్‌ఫ్లిక్స్‌కు రూ.2 లక్షల కోట్ల నష్టం!
➤అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు & పాత 2G/3G నెట్‌వర్క్‌లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.