కేంద్ర మంత్రి అమిత్ షా
పట్టణ సహకార రుణ రంగాన్ని విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. దేశ రాజధానిలో జరిగిన ‘అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సెక్టార్, కో-ఆప్ కుంభ్ 2025’ అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలోని 2,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి పట్టణంలో వచ్చే ఐదేళ్లలో ఒక సహకార బ్యాంకు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.
అర్బన్ కో-ఆపరేటివ్ సెక్టార్‌లో ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు ఇవ్వడాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు అమిత్‌షా చెప్పారు. భాగస్వామ్య యాజమాన్య నమూనా ఆధారంగా వ్యాపారాన్ని విస్తరించే లక్ష్యంలో భాగంగా ఈ సదస్సులో రూపొందించిన ‘ఢిల్లీ డిక్లరేషన్ 2025’ రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఎన్‌పీఏల తగ్గింపు
గత రెండేళ్లలో పట్టణ సహకార బ్యాంకుల నిరర్థక ఆస్తులు (NPA) గణనీయంగా తగ్గాయని అమిత్‌షా హైలైట్ చేశారు. గత రెండేళ్లలో ప్రభుత్వం ఎన్‌పీఏను 2.8 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గించేందుకు ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. సహకార రంగంలోని రుణదాతలు ఆర్థిక డిజిటల్ సాంకేతికతలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘సహకార్ డిజీ-పే’, ‘సహకార్ డిజీ-లోన్’ యాప్‌లు డిజిటల్ విప్లవంలో సహకార రంగం భాగస్వామ్యానికి గుర్తింపు ఇవ్వనున్నాయని చెప్పారు.
యువత, బలహీన వర్గాల సాధికారత కోసం..
యువ పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక బృందాలు, సమాజంలోని బలహీన వర్గాల సాధికారత కోసం పట్టణ సహకార బ్యాంకులు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ‘సహకార సంఘాలను బలోపేతం చేయడం, అదే సమయంలో బలహీన వర్గాలకు దన్నుగా నిలవడం మా లక్ష్యం. పట్టణ సహకార బ్యాంకులు తప్ప మరే సంస్థ దీన్ని సాధించలేదు’ అని ఆయన నొక్కి చెప్పారు. ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడానికి ఈ రంగాన్ని విస్తరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయంలో ఉమ్మడి విధానాన్ని రూపొందించాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.
సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సహకార రంగాన్ని డిజిటలైజ్ చేయడానికి, ఈ విభాగంలో సేవలు విస్తరించడానికి కేంద్రం అనేక మార్పులను తీసుకువచ్చింది. జులై 2021లో మోదీ ప్రభుత్వం కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో సహకార మంత్రిత్వ శాఖను సృష్టించింది. జాతీయ స్థాయి సహకార సంఘాల పాలనను మెరుగుపరచడానికి గత సంవత్సరం పార్లమెంటు బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) చట్టం, 2022ను కూడా ఆమోదించింది.
ఇదీ చదవండి: ఉద్యోగంతో ఊడిగం చేయాల్సిందేనా..!


