
అమెరికాలో లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం రాజీనామా చేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)పాలనకు వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగంలో భారీగా ఉద్యోగుల తగ్గింపునకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగాల నుంచి తప్పుకొనే ఉద్యోగులకు ట్రంప్ సర్కారు స్వచ్ఛంద రాజీనామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
ఈ రాజీనామా కార్యక్రమంలో భాగంగా లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. దీనికి మంగళవారం తుది గడువు కావడంతో అంగీకరించిన వారందరూ ఆ రోజున రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయకపోతే పెద్ద ఎత్తున తొలగింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఫెడరల్ ఏజెన్సీలను వైట్‌హౌస్ ఆదేశించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వ రంగంలో అత్యంత భారీ సంఖ్యలో నిష్క్రమణలు ఇవే కావడం గమనార్హం.
కాగా చెప్పినట్లు రాజీనామా చేసిన ఉద్యోగులకు ఎనిమిది నెలలపాటు అడ్మినిస్ట్రేటివ్ లీవ్ ఇచ్చి ఆ ఎనిమిది నెలల కాలానికి వేతనాలు, ఇతర ప్రయోజాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందు కోసం ప్రభుత్వానికి 14.8 బిలియన్ డాలర్లు ఖర్చు కానుంది. అయితే ఉద్యోగుల తగ్గింపుతో దీర్ఘకాలికంగా ఏటా 28 బిలియన్ డాలర్లు ప్రభుత్వానికి ఆదా అవుతాయని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: చైనా కోసం గాడిదలు పెంచుతున్న పాకిస్థాన్..